వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా మారుతిసుజుకీ బాటలోనే నడుస్తోంది. దశలవారీగా డీజిల్ చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా మారుతిసుజుకీ బాటలోనే నడుస్తోంది. దశలవారీగా డీజిల్ చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.
త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గార నిబంధనల కారణంగా వీటి ధరలు పెరుగుతాయని, ఫలితంగా గిరాకీ మందగించొచ్చని అంచనా వేస్తోంది. ఈ కారణంగానే ఈ కార్లను తయారీ చేయడం భారంగా మారుతుందని టాటా మోటార్స్ అధ్యక్షుడు (ప్రయాణికుల వాహన విభాగం) మయాంక్ పరీఖ్ వెల్లడించారు.
ప్రస్తుతం టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్ టియాగో, కాంపాక్ట్ సెడాన్ టిగోర్, బోల్ట్, జెస్ట్ వంటి చిన్నకార్లను డీజిల్ ఇంజిన్లతో విక్రయిస్తోంది. చిన్నకార్ల విభాగంలో 80 శాతం గిరాకీ పెట్రోల్ వేరియంట్లకే లభిస్తోందని, అందుకే డీజిల్‌లో చిన్నకార్లపై అదనపు పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదని పరీఖ్ అన్నారు.
కాగా, ఇప్పటికే మారుతిసుజుకీ కూడా డీజిల్ కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ కూడా బీఎస్-6 ఉద్గార నిబంధనలనే కారణంగా చూపింది.
చదవండి: మారుతి సంచలన నిర్ణయం: డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత