No Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి.. అస‌లు ఏ వ‌డ్డీ ఉండ‌దా..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 21, 2022, 12:05 PM IST
No Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి.. అస‌లు ఏ వ‌డ్డీ ఉండ‌దా..?

సారాంశం

నో-కాస్ట్ ఈఎంఐ లేదా జీరో కాస్ట్ ఈఎంఐ అంటే మీకు సున్నా వడ్డీతో సరసమైన నెలవారీ వాయిదాలలో ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లించే ప్లాన్. మీరు అదనపు ఛార్జీలు లేకుండా ఉత్పత్తి యొక్క మొత్తం ధరకు మాత్రమే చెల్లిస్తున్నారని అర్థం.

ఫైనాన్సింగ్ సంస్థలు జీరో కాస్ట్ ఈఎంఐ పేరుతో కస్టమర్లను చాలా వరకు ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా గృహోపకరణాల కొనుగోలులో జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను చూస్తుంటాం. వడ్డీ లేని రుణంతో వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. దీంతో అందరూ ఇటు వైపు మళ్లుతుంటారు. అయితే జీరో కాస్ట్ ఈఎంఐలో ఓ మెలిక ఉంది. ధరలోనే వడ్డీ మొత్తాన్ని కూడా కలిపేస్తారు. అసలుతో వడ్డీని కలిపి రుణ కాలపరిమితికి తగినట్లుగా ఈఎంఐలను నిర్ణయిస్తారు. అసలు జీరో వడ్డీ రుణాలు లేవని ఆర్బీఐ చెప్పింది. వడ్డీ మొత్తాన్ని కూడా ఉత్పత్తి ధరలో కలిపి అమ్మడమే జీరో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ మెలిక.

జీరో కాస్ట్ ఈఎంఐ అంటే?
నో-కాస్ట్ ఈఎంఐ లేదా జీరో కాస్ట్ ఈఎంఐ అంటే మీకు సున్నా వడ్డీతో సరసమైన నెలవారీ వాయిదాలలో ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లించే ప్లాన్. మీరు అదనపు ఛార్జీలు లేకుండా ఉత్పత్తి యొక్క మొత్తం ధరకు మాత్రమే చెల్లిస్తున్నారని అర్థం. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని పొందుతున్నప్పుడు మీరు ఎలాంటి డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు లేదా వడ్డీని చెల్లించవలసిన అవసరం లేదు. అయితే బ్యాంకు వడ్డీని వసూలు చేస్తుందా? అంటే వసూలు చేస్తుంది. ఉత్పత్తిని కొనుగోలు చేసే సమయంలోనే వారు వసూలు చేసే వడ్డీని వసూలు చేస్తారు. ఉత్పత్తి ధరలోనే కలిపి విక్రయిస్తారు. అంటే ఇది హిడెన్ ఛార్జ్.

ఉదాహరణకు ఒక ఉత్పత్తి ధర రూ.1000 అయితే, దీనిని మీరు మొత్తం నగదు చెల్లించి కొనుగోలు చేస్తే డీలర్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తాడు. కానీ దానిని ఈఎంఐలో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ ఉండదు. సదరు డిస్కౌంట్ మొత్తాన్ని వడ్డీకి సమానంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ నియమ నిబంధనలను చూడకుండా ఓ నిర్ణయానికి రావద్దు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ చార్జీలు, కాలపరిమితి ఇవన్నీ చూసుకోవాలి. నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేసే ముందు వివిధ డీలర్ల వద్ద ధరలను పోల్చి చూడాలి. నేరుగా నగదుతో కొనుగోలు చేయడానికి, ఈఎంఐలతో కొనుగోలు చేయడానికి మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని పరిశీలించాలి. ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావాలి.

ఇతర రుణాల మాదిరిగానే నో-కాస్ట్ ఈఎంఐని సకాలంలో చెల్లించాలి. లేదంటే అది క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం గురించి మీకు కచ్చితంగా తెలియకుంటే నో-కాస్ట్ ఈఎంఐ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వడ్డీ మొత్తం పైన బ్యాంకు జీఎస్టీని వసూలు చేస్తుంది. అయితే మీరు కొనుగోలు చేసే సమయంలో బ్యాంకు విధించే వడ్డీ మీకు ముందస్తు తగ్గింపుగా అందిస్తారు. ఇది మీకు నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?