మాల్య షేర్లు కొంటే మీకే నష్టం.. నీరవ్ మోదీ ఆస్తులు జప్తు

By Arun Kumar PFirst Published Oct 26, 2018, 12:39 PM IST
Highlights

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని లండన్ నగరానికి పరారైన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యకు చెందిన బ్లడ్ స్టాక్ బ్రీడర్స్ స్టాక్స్ కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఆదాయం పన్నుశాఖ హెచ్చరించింది. ఆ స్టాక్స్ పై డిమాండ్ నోటీసులు జారీ చేశామని, కొన్న వారే రిస్క్ భరించాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన రూ.255 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. 

బెంగళూరు: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు చెందిన యునైటెడ్‌ రేసింగ్‌ అండ్‌ బ్లడ్‌స్టాక్‌ బ్రీడర్స్‌ లిమిటెడ్‌ (యుఆర్‌బీబీఎల్‌) షేర్లను కొనుగోలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని ఆదాయం పన్ను శాఖ (ఐటీ) హెచ్చరించింది. ఈ నెల 30వ తేదీన యుఆర్‌బీబీఎల్‌కు చెందిన 41.52 లక్షల షేర్లను ఈ-వేలం వేయనున్నట్లు కర్ణాటక డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌-2 ప్రకటించింది. ఈ నేపథ్యంలో మదుపర్లకు ఆదాయం పన్ను శాఖ ఈ హెచ్చరిక జారీ చేయటం గమనార్హం.
 
ఇందుకే మాల్యా సంస్థ షేర్ల కొనుగోలు రిస్క్
ఈ షేర్ల విషయమై డిమాండ్‌ నోటీసును ఇప్పటికే జారీ చేశామని, ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 281 కింద ఎవరైనా ఈ షేర్లను కొనుగోలు చేసినా, బదలాయించినా చెల్లుబాటుకావని ఆదాయం పన్ను శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ-వేలంలో ఈ షేర్లను కొనుగోలు చేసినట్లయితే రిస్క్‌ను వారే భరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు ఈ షేర్ల వేలాన్ని నిలిపి వేయాలంటూ కర్ణాటక డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌కు ఆదాయ పన్ను శాఖ అధికారులు లేఖ రాశారని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి.

రూ.225 కోట్ల నీరవ్ మోదీ ఆస్తుల జప్తు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం సూత్రధారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.255 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాల్ని హాంకాంగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. దీంతో నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ ఛోక్సీలకు  సంబంధించి ఈడీ జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,744 కోట్లకు చేరింది. ఈ విలువైన ఆభరణాలు దుబాయ్‌లోని తన ఆభరణాల సంస్థల నుంచి హాంకాంగ్‌లో ఉన్న సంస్థలకు ఎగుమతి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఆభరణాల ఎగుమతులు, యాజమాన్య హక్కుల ఆధారంగా జప్తు
నీరవ్ మోదీ కేసు విచారణలో భాగంగా ఈ విలువైన ఆభరణాలకు సంబంధించి ఎగుమతైన వివరాలు, వాటి యాజమాన్య హక్కులు ఎవరిపై ఉన్నాయనే వివరాలన్నీ సంపాదించామని, ఈ ఆధారాల ద్వారానే ఆభరణాలను జప్తు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.6,400 కోట్ల బ్యాంకు సొమ్మును తన కుటుంబ సభ్యల పేర్లపై ఉన్న డమ్మీ సంస్థలకు నీరవ్‌ బదలాయించారని గతంలో ఈడీ చార్జిషీట్‌ సైతం దాఖలు చేసింది.

click me!