
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ (hyderabad real estate) భూమ్ ఏ మాత్రం తగ్గలేదు. కరోనా మహమ్మారి సమయంలో కూడా నగరంలో జరిగిన కొన్ని డీల్స్ (property deals) చూస్తే ఇది నిజమనే అనిపిస్తుంది. తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద మారుతీ కార్ డీలర్‌గా ఉన్న వరుణ్ మోటార్స్ యజమాని వల్లూరుపల్లి వరుణ్ దేవ్ (Vallurupalli Varun Dev) తన ప్రాపర్టీని భారీ రేటుకు విక్రయించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్‌లోని ( Jubilee Hills) తనకు చెందిన ఓ ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ సంస్థ వాసవీ గ్రూప్‌కు విక్రయించారు. 1,368 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని వాసవి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యర్రం విజయకుమార్ రూ. 37 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సేల్ డీడ్ ఈ ఏడాది అక్టోబర్ 22 రిజిస్టర్ చేయబడిందని జాప్‌కీ డాట్ కామ్ నివేదికను ఉటంకిస్తూ మనీ కంట్రోల్ కథనాన్ని ప్రచురించింది.
‘కరోనా మహమ్మారి సమయంలో ఆస్తులు కొనుగోలు చేయాలని భావిస్తున్న ఎక్కువ మంది జనసాంద్రత ఎక్కువగా ఉండే బహుళ అంతస్తుల భవనాల్లోని విలాసవంతమైన ఫ్లాట్స్ కన్నా.. తక్కువ సాంద్రత కలిగి అభివృద్ది చెందిన ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అందువల్లే ఈ ప్రాంతంలోని ఆస్తులకు డిమాండ్ పెరిగింది’ అని స్థానిక ప్రాపర్టీ బ్రోకర్ ఒకరు చెప్పారు.
ప్రాపర్టీని విక్రయించడమే కాకుండా.. దాదాపు అంతే మొత్తంలో వెచ్చించి వరుణ్ దేవ్ నగరంలో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని.. ప్రముఖులు నివసించే పోష్ ఏరియాలో వరుణ్ దేవ్ రూ. 33 కోట్లకు ఓ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ప్రాపర్టీ విస్తీర్ణం 1,200 చదరపు గజాలు కాగా, నిర్మాణ విస్తీర్ణం 1,782 అడుగులు ఉంది. ఈ డీల్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే జరిగింది.
ఇదిలా ఉంచితే.. జూబ్లీహిల్స్‌లో ఇటీవలి కాలంలో ప్రాపర్టీ చేతులు మారింది. నవంబర్ 15వ తేదీన 841 చదరపు గజాల ప్లాట్‌లోని ఓ ఇంటిని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని రత్నారెడ్డికి రూ. 26 కోట్లకు విక్రయించారు.
ఇక, జాప్‌కీ డాట్ కామ్ ప్రకారం.. గత ఐదేళ్లలో జూబ్లీహిల్స్‌లో రూ. 10 కోట్లకు పైగా విలువ కలిగిన 120 అమ్మకాలు నమోదు అయ్యాయి. 2020లోనే రూ. 10 కోట్లకు పైగా విలువ కలిగిన 17 విక్రయ లావాదేవీలు జరిగాయి. ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేసిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నట్టుగా తెలుస్తంది.
సాధారణంగా జూబ్లీహిల్స్‌లోని ప్లాట్ సైజులు 1,000 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉంటాయని ఆ ప్రాంతంలో డీల్స్ చేసే ప్రాపర్టీ బ్రోకర్స్ తెలిపారు. చదరపు గజానికి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు లభిస్తుందని చెప్పారు. అయితే ఎక్కువగా నివసించేది.. ప్రముఖలే కావడంతో.. లావాదేవీలు ఎక్కువగా నోటి మాట ద్వారానే జరుగుతాయని, బయటకు చెప్పేదాని కన్నా ధరలు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.
ఇక, గత కొంతకాలంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మార్కెట్లలో ప్రాపర్టీ ధరలు 2 నుంచి 6 శాతం వరకు పెరిగాయి. కొత్త టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు ఈ నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడం, వాటి లీజులను పునరుద్ధరించడంతో గృహాలకు అధిక డిమాండ్‌ను ప్రేరేపించాయి.