Cryptocurrency: ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

By team teluguFirst Published Nov 30, 2021, 3:46 PM IST
Highlights

దేశంలో క్రిప్టో కరెన్సీ (cryptocurrency) నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో (Rajya Sabha) మంగళవారం డిజిటల్ కరెన్సీకి (digital currency) సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. 


దేశంలో క్రిప్టో కరెన్సీ (cryptocurrency) నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో (Rajya Sabha) మంగళవారం డిజిటల్ కరెన్సీకి (digital currency) సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ సామర్థ్యంపై విస్తృతంగా చర్చలు జరిగాయని, ప్రభుత్వం త్వరలో బిల్లును తీసుకువస్తుందని చెప్పారు. క్రిప్టో కరెన్సీపై బిల్లును కేంద్రం ఆమోదించిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. బిల్లులో అన్ని విషయాలు ఉంటాయని.. అప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదని అన్నారు.

ఇటువంటి బిల్లునే గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని కేంద్రం చూసిందని.. అది కుదరలేదని చెప్పారు. పాత బిల్లుకు మార్పులు చేసి కొత్త బిల్లును తీసుకురానున్నట్టుగా చెప్పారు. డిజిటల్ కరెన్సీల ప్రకటనలను (cryptocurrency ads) నిషేధించడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయితే ఇవి ప్రమాదకరమైనవి, పూర్తి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లో లేవని అన్నారు. వీటిపై అవగాహన కల్పించడానికి ఆర్బీఐ, సెబీ ద్వారా చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలు అవాంఛనీయ కార్యకలాపాలకు దారితీసే ప్రమాదాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇక, క్రిప్టో ట్రేడ్‌లపై ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తం గురించి అడిగిన ప్రశ్నకు కూడా నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. ‘క్రిప్టోకరెన్సీలపై వసూలు చేసిన పన్ను మొత్తం గురించి సమాచారం సిద్ధంగా లేదు’ అని తెలిపారు.  ఇక, సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. దేశంలో బిట్‌కాయిన్‌ను (Bitcoin) కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిపారు. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించడం లేదని చెప్పారు. ఈ మేరకు ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 

Also read: Cryptocurrency regulation: అమెరికా, చైనాతో సహా ప్రపంచ దేశాలలో క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఎలా ఉంది..?

రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా భారత్‌లో అధికారికంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దీని ద్వారా దేశంలో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్‌లో క్రిప్టోకరెన్సీపై దేశంలో ఎలాంటి నియంత్రణ, నిషేధం లేవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టోకరెన్సీలకు వ్యతిరేకంగా తన దృఢమైన అభిప్రాయాలను కలిగి ఉంది, అవి స్థూల ఆర్థిక మరియు ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని పేర్కొంది. వారిపై వర్తకం చేస్తున్న పెట్టుబడిదారుల సంఖ్య మరియు వారి క్లెయిమ్ చేసిన మార్కెట్ విలువలను కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమానించింది.

click me!