UPI for Feature Phones: మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ సరికొత్త యూపీఐ ఫీచర్ ను లాంచ్ చేశారు. ఇకపై UPI పేమెంట్లను ఫీచర్ ఫోన్‌ల ద్వారా కూడా చేసుకునే వీలుంది. ఇందుకోసం ప్రత్యేక యూపీఐని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం (మార్చి 8) అంతర్జతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. దీని పేరు UPI123Pay. దీంతో పాటు డిజిసాథి (DigiSaathi) పేరిట డిజిటల్ పేమెంట్స్ కోసం 24x7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సేవల ద్వారా డిజిటల్ బ్యాకింగ్ సేవలను మరింత సులభతరం చేయవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే ఇంటర్‌నెట్ సదుపాయం లేని ఫీచర్స్ ఫోన్ల నుంచి సైతం డిజిటల్ పేమెంట్ చేసే యూపీఐ (UPI) సేవలు పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది.
UPI123Pay సహాయంతో, వినియోగదారులు ఫీచర్ ఫోన్‌ల నుండి UPI పేమెంట్స్ చేయగలుగుతారు. స్కాన్, పే మినహా అన్ని రకాల లావాదేవీలు దీనితో చేయవచ్చు. వీటి పేమెంట్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, వినియోగదారులు వారి మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలి.
ఇదిలా ఉంటే UPI పేమెంట్ ప్లాట్‌ఫారమ్ 2016లో ప్రారంభించారు. అప్పటి నుంచి దీని వినియోగం అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రజలు యూపీఐ పేమెంట్స్ కు చాలా అలవాటు పడిపోయారు. ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు అధికం అవుతున్నాయి. కానీ, UPI పేమెంట్ కోసం స్మార్ట్‌ఫోన్ అవసరం. ఈ నేపథ్యంలో పేద వెనుకబడిన వర్గాల్లో యూపీఐ సేవలను, చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఫీచర్ ఫోన్‌ల కోసం కూడా యూపీఐని లాంచ్ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది.
ఫీచర్ ఫోన్లకు యూపీఐ సదుపాయం అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో డిజిటల్ పేమెంట్ల వినియోగం పెరుగుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇది ఆర్థిక సేవల పరిధిని పెంచుతుంది.
ఫీచర్ ఫోన్ ద్వారా UPI పేమెంట్స్ ఎందుకు అవసరం..
ఫీచర్ ఫోన్ అంటే బేసిక్ ఫోన్. ఈ ఫోన్‌లో కాల్‌లు చేయడానికి, కాల్‌లను స్వీకరించడానికి సందేశాలు (SMS) పంపడానికి, స్వీకరించడానికి మాత్రమే సౌకర్యం ఉంది. నేటికీ, జనాభాలో అధిక భాగం ఈ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఫీచర్ ఫోన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
భారతదేశంలో మొబైల్ ఫోన్‌లను ప్రవేశపెట్టినప్పుడు, ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ ధర స్మార్ట్ ఫోన్ కంటే చాలా తక్కువ. ఈ కారణంగా, తక్కువ ఆదాయం ఉన్నవారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇందులో పెద్దగా సౌకర్యాలు లేకపోవడంతో నిరక్షరాస్యులు సైతం వీటిని వినియోగించుకోవడం సౌకర్యంగా ఉంటుంది.