Chicken Price Hike: చికెన్ ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. కిలో మాంసం ఎంతంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 08, 2022, 03:10 PM IST
Chicken Price Hike: చికెన్ ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. కిలో మాంసం ఎంతంటే..?

సారాంశం

కొందరికి ముక్క ఉంటే గానీ ముద్ద దిగదు. అందులోనూ చికెన్ తప్పనిసరి. ఇప్పుడు అదే కోడి కొండెక్కి కూర్చుంది. ఒక్క‌సారిగా ధర పెరిగి చికెన్ ప్రియుల‌ను భ‌య‌పెడుతోంది.  

ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు వంట నూనెల ధరలు (oil prices) పెరిగాయి. పెట్రోల్, డీజిల్ (petrol diesel prices), ఇతర నిత్యావసరాలు ఎప్పటి నుంచో పెరిగాయి. ఇప్పుడు మాంసం ధరలు సైతం మండిపోతున్నాయి. చికెన్‌ ముక్క ముడితే ధరల మంట‌ తగులుతోంది. మటన్‌ ధరలు ఎప్ప‌టినుంచో మండుతుండ‌గా.. ఇప్పుడు కోడి కూర కూడా ప్రియమైపోయింది. మూడు వారాల వ్యవధిలోనే చికెన్ ధర ఏకంగా  రూ.100పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది.

గ‌త నెలలో రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల ఆదివారం ఏకంగా కిలో చికెన్‌ ధర రూ.280 నుంచి రూ. 290 పలికింది. నెల వ్యవధిలోనే ఏకంగా రూ.100కి పైగా పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయానికి కిలో కోడి కూర ధర రూ.200 మాత్రమే ఉంది. ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. కరోనా ప్రభావం, దాణా ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. కిలో మటన్‌ ధర రూ.750 నుంచి రూ.900 వరకు పలుకుతుంది.

సాధారణంగానే ప్రతి వేసవిలో చికెన్‌ ధరలు పెరుగుతాయి. ఎండలకు కోళ్లు చనిపోవడం, రైతులు తక్కువగా పిల్లల్ని వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ధరలు వేసవిలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వేసవి మొత్తం చికెన్‌ ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో.. ఎండలు పెరిగేకొద్దీ చికెన్ కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. నాటుకోడి మాంసం ధర కిలో 400 నుంచి 500కి చేరింది. నాటుకోళ్ల లభ్యత లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం 500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.  

రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని అంచనా. ఆదివారం రోజు 15 లక్షల కిలోలకు పైగా ఉంటోంది. కరోనా భయం తగ్గడంతో గ‌త‌ పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగిన‌ట్లు అంచ‌నా. ప్రస్తుతం వేసవికాలం ప్రారంభమైంది. అంతేకాకుండా.. ఇటీవల మొక్కజొన్న, సోయాబీన్‌ ధరలు భారీగా పెరగడంతో దాణా ఖర్చు రెట్టింపు అయ్యిందని, దాన్ని భరించలేక రైతులు కోళ్ల పెంపకాన్ని మానేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గుతుందని, ఈ ప్రభావం ధరలపై ఉందని పేర్కొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
Car Loan: న్యూ ఇయ‌ర్‌లో కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులివే