రాజన్ రిటార్ట్: మీ హయాంలోనే ఎక్కువ కాలం పనిచేశా.. ‘నిర్మల’మ్మకు ఘాటు రిప్లై

By Sandra Ashok KumarFirst Published Nov 1, 2019, 10:05 AM IST
Highlights

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లే ఆర్థిక వ్యవస్థ కునారిల్లిందని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు రాజన్ ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఎక్కువ కాలం పని చేసింది మోదీ హయాంలోనేనని గుర్తు చేస్తూనే రాజకీయ చర్చకు చోటివ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకుల దుస్థితికి తానే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. తాను మూడేళ్లు ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశానని, అయితే రెండేండ్లు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఉన్నానని గుర్తుచేశారు. 2013 సెప్టెంబర్ 5 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. 

2013లో రఘు‌రామ్ రాజన్‌ను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది. కానీ మన్మోహన్ సింగ్ హయాంలో తాను ఎనిమిది నెలలు మాత్రమే పని చేశానని రాజన్ గుర్తు చేశారు. 2014 మే నెలలో మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. కాగా, దేశీయ బ్యాంకింగ్ రంగం.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక ఇబ్బందులకు కారణం రాజన్, గత యూపీఏ ప్రభుత్వమేనని నిర్మలా సీతారామన్ ఇటీవల తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. 

బ్యాంకింగ్ రంగంపై రాజన్ పర్యవేక్షణ సరిగా లేదని, ఇక అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో ఫోన్లపై కార్పొరేట్లకు బ్యాంకర్లు రుణాలిస్తూపోయారని, దీంతో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరాయని మండిపడ్డారు. రాజన్ - మన్మోహన్ హయాంలో బ్యాంకులు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. 

also read హైదరాబాద్ లో రిలయన్స్ స్మార్ట్ నూత‌న స్టోర్ ప్రారంభం

ఈ క్రమంలో గురువారం సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ తానే బ్యాంకుల మొండి బకాయిలను ప్రక్షాళన చేసే పనిని మొదలు పెట్టానని, అయితే తన తర్వాత వచ్చినవారి ఆధ్వర్యంలో ఇదేమంత ప్రభావవంతంగా జరుగలేదని తెలిపారు. 

‘నేను కేవలం 8-9 నెలలే కాంగ్రెస్ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశాను. 26 నెలలకుపైగా కాలం బీజేపీ పాలనలోనే ఉన్నాను’ అని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. అంటే మూడింట రెండొంతుల పదవీకాలం ఎన్డీయే హయాంలోనే ముగిసిందని, అయినా దీనిపై తాను రాజకీయ చర్చకు దిగదల్చుకోలేదని రాజన్ చెప్పారు.

2008 నాటి ఆర్థిక మాంద్యం వల్లే దేశీయంగా సమస్యలకు మూలాలు ఏర్పడ్డాయని రఘురామ్ రాజన్ తెలిపారు. అంతకుముందు పెట్టిన పెట్టుబడులు తర్వాత మొండి బకాయిలుగా మారాయన్నారు. తాను బాధ్యతలు చేపట్టేనాటికే గుట్టలుగుట్టలుగా పేరుకున్న మొండి బాకీలతో బ్యాంకు పద్దులు స్తంభించాయన్నారు. 

వాటిని సరిదిద్దే పని ప్రారంభించినా.. అది పూర్తి కాకుండానే తన పదవీ కాలం ముగిసిందని రఘురామ్ రాజన్ చెప్పారు. తొలి విడుతలో మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా దృష్టి పెట్టలేదని, దీనికి కారణం అధికార కేంద్రీకరణేనని రాజన్ గతంలో విమర్శించినది విదితమే. ఈ నేపథ్యంలోనే కొలంబియా యూనివర్సిటీలో సీతారామన్.. రాజన్‌పై విమర్శలు గుప్పించారు.

దేశ వృద్ధిరేటు పెరిగితేనే ఉద్యోగాలూ పెరుగుతాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రతి నెలా 10 లక్షల మంది యువత ఉద్యోగార్థులుగా మారుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ 5 శాతం జీడీపీ ఎందుకూ పనికి రాదని అభిప్రాయపడ్డారు. 

also read 7 వేల ఉద్యోగులపై కాగ్నిజెంట్‌ వేటు...

దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబించే వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉంటేనే అన్ని విధాలా మంచిదని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కాబట్టి సంస్కరణల విషయంలో వెనుకడుగు వేయరాదని, సాహసోపేత సంస్కరణలతో ముందుకెళ్లాలని సూచించారు. కేంద్రంలో మోదీ సర్కారుకు స్పష్టమైన మెజారిటీ ఉండటం శుభ పరిణామంగా పేర్కొన్న ఆయన.. అయినా సంస్కరణల విషయంలో వెనుకబడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

దేశానికిప్పుడు కొత్త తరం సంస్కరణల అవసరం ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మందగించిన వృద్ధిరేటును తిరిగి పరుగులు పెట్టించడానికి ఇవి కావాల్సిందేనన్నారు. భారత జీడీపీ 5 శాతం వద్ద ఉందంటే.. అది గణనీయమైన ఆర్థిక మందగమనానికి సంకేతమేనన్నారు. 

2016లో ఓ త్రైమాసికంలో జీడీపీ 9 శాతాన్ని తాకిందని రఘురామ్ రాజన్గుర్తుచేశారు. ఇప్పుడది 5 శాతానికి పడిపోవడం ఆందోళనకరమేనన్నారు. కాగా, బ్యాంకులకు మూలధన అవసరాలను బాగానే తీర్చిన కేంద్రం.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకూ ఆ అవసరాన్ని తీర్చాల్సి ఉందన్నారు. అప్పుడే అటు దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని, ఇటు మొండి బకాయిల తీవ్రతా తగ్గుతుందని చెప్పారు.
 

click me!