ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్సులు త‌గ్గించండి.. ప్రధాని మోదీ కార్యాలయాన్ని కోరిన టెస్లా ప్రతినిధులు..!

By team teluguFirst Published Oct 21, 2021, 2:25 PM IST
Highlights

ఇండియాలో తమ ఎలక్ట్రిక్  వాహనాలను విక్రయించాలని  భావిస్తున్న  ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ.  భారత మార్కెట్‌లోకి  అడుగుపెట్టక ముందే ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని టెస్లా కంపెనీ  ప్రతినిధులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరినట్టుగా  తెలుస్తోంది.

ఇండియాలో తమ ఎలక్ట్రిక్  వాహనాలను విక్రయించాలని  భావిస్తున్న  ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ. అయితే దేశంలో ట్యాక్స్ ఎక్కువగా ఉన్నట్టుగా టెస్లా కంపెనీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే  భారత మార్కెట్‌లోకి  అడుగుపెట్టక ముందే ఎలక్ట్రిక్ వాహనాలపై (Electric Vehicles) దిగుమతి పన్నులను తగ్గించాలని టెస్లా కంపెనీ  ప్రతినిధులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరినట్టుగా  తెలుస్తోంది.  ఈ మేరకు విశ్వసనీయ  వర్గాలను  ఉటంకిస్తూ  రాయిటర్స్ వార్త  సంస్థ కథనాన్ని  ప్రచురించింది. టెస్లా ఈ ఏడాది నుంచే దిగుమతి  చేసుకున్న ఎలక్ట్రిక్  కార్లను  భారత్‌లో విక్రయించడం మొదలుపెట్టాలని భావిస్తున్నట్టుగా చెబుతోంది. అయితే ఇక్కడ పన్నులు అత్యధికంగా ఉన్నాయని  ఆరోపించింది. మరోవైపు ఈ ఏడాది జూలైలో కూడా పన్ను తగ్గింపుల  కోసం కేంద్రాన్ని  Tesla ప్రతినిధులు అభ్యర్థించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే  దీనిపై పలువురు దేశీయ  వాహన  తయారీదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

టెస్లా ఇండియా ఎగ్జిక్యూటివ్ మ‌నుజ్ ఖురానా.. ఇంపోర్ట్ ట్యాక్స్ త‌గ్గింపు అంశంపై ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య అధికారుల‌తో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్న ప‌న్ను విధానం త‌మ కంపెనీకి అనుకూలంగా లేద‌ని టెస్లా ప్రతినిధులు చెప్పారు. అయితే  టెస్లా సీఈవో ఎలన్ మాస్క్‌, ప్రధాని  మోదీల మధ్య ప్రత్యేక  సమావేశం కోసం టెస్లా ప్రతినిధులు ప్రధాని కార్యాలయాన్ని  అభ్యర్థించినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని  రాయిటర్స్ పేర్కొంది. 

ఇదిలా ఉంటే ఇంపోర్ట్  ట్యాక్స్‌ తగ్గిస్తే..  దేశీయ ఉత్ప‌త్తి రంగంలో పెట్టుబడులు త‌గ్గుతాయ‌ని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది తీవ్ర ప్రభావాన్ని  చూపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు  కూడా భావిస్తున్నాయి. 

స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచడానికి ఇటీవల TPG తో సహా పెట్టుబడిదారుల నుండి 1 బిలియన్ల డాలర్లు సేకరించిన టాటా మోటార్స్ వంటి భారతీయ కంపెనీలు.. టెస్లా‌కు రాయితీలు ఇవ్వడం దేశీయ ఎలక్ట్రిక్  వాహనాల తయారీని పెంచే భారతదేశ ప్రణాళికలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నాయి.

Also Read: చరిత్ర సృష్టించిన ఇండియా.. 100 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్ డ్రైవ్.. ఈ విజయం ప్రతి పౌరునిది అన్న మోదీ

ఇక, టెస్లా భారతదేశంలో మేడ్-ఇన్-చైనా కార్లను విక్రయించకూడదని.. వాటికి బదులుగా స్థానికంగానే వాహనాలను తయారు చేయాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. అయితే టెస్లా మొదట దిగుమతులతో భారత్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రీమియం ఎలక్ట్రిక్  వాహనాలు భారతీయ మార్కెట్‌లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దేశంలో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది.
 

click me!