ఒకేచోట రుణ గ్రహీత జాతకం.. ఎస్బీఐ& ఐసీఐసీఐ తర్వాత..!!

By rajesh yFirst Published Dec 24, 2018, 11:28 AM IST
Highlights


ప్రజా రుణాల చరిత్ర నిర్వహణ కోసం దాఖలైన బిడ్లలో ఆరు సంస్థల జాబితాను ఆర్బీఐ కుదించింది. ఇందులో టీసీఎస్, విప్రో, ఐబీఎం, క్యాప్ జెమినీ తదితర సంస్థలు ఉన్నాయి. మరోవైపు బ్యాంకు ఆఫ్ బరోడా, డెనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీన ప్రక్రియపై వచ్చేనెలలో కేంద్రం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. ఈ మూడు బ్యాంకులు విలీనమైతే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు తర్వాత స్థానంలో నిలుస్తుంది. 

న్యూఢిల్లీ/ ముంబై: వివిధ బ్యాంకుల వద్ద కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తీసుకున్న రుణాల వివరాలను నిర్వహించేందుకు టీసీఎస్‌, విప్రో, ఐబీఎం సహా ఆరు సంస్థలకు కుదించింది. ఒకేచోట ప్రజా రుణ చరిత్ర (పీసీఆర్‌) అంతా నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సంస్థల నుంచి 6 దిగ్గజ సంస్థలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) షార్ట్‌లిస్ట్‌ చేసింది. 

ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, విప్రో, ఐబీఎం ఇండియా, క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఇండియా, డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఇండియా, మైండ్‌ట్రీ సంస్థలను షార్ట్‌లిస్ట్‌ చేశారు. రుణ స్వీకర్తల వివరాలన్నీ నమోదు చేయడంతోపాటు, ఉద్దేశ పూర్వక ఎగవేతదార్లను సులువుగా పట్టేందుకు ఇందువల్ల వీలవుతుంది.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ల విలీనంపై విధివిధానాలు ఈ నెలాఖరుకల్లా ఖరారు కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మూడు బ్యాంకుల విలీన పథకాన్ని వచ్చేనెల 8వ తేదీతో ముగియనున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. విలీనంలో భాగంగా ఆయా బ్యాంకుల షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటర్ల మూలధన అవసరాలు వంటి వివరాలు ఈ స్కీమ్‌లో ఉంటాయి.
 
ఈ పథకానికి మూడు బ్యాంకుల బోర్డులూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతక్రితం ఎస్బీఐ తన ఐదు అనుబంధ విభాగాలతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకుంది. 

తద్వారా ఎస్బీఐ ప్రపంచంలోని టాప్‌ 50 బ్యాంకుల జాబితాలోకి చేరింది. బీఓబీ, దేనా, విజయా బ్యాంక్‌ విలీనం తర్వాత ఏర్పడే సంస్థ మొత్తం వ్యాపారం రూ.14.82 లక్షల కోట్ల స్థాయికి చేరుకోనున్నది. ఎస్బీఐ, ఐసీఐసీఐ తర్వాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనున్నది.
 

click me!