దేశీయ ఐటీ రంగంలో మరో కుదుపు.. టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రాజీనామా.. ఆయన స్థానంలో వచ్చేదెవరంటే..

By SumaBala BukkaFirst Published Mar 17, 2023, 8:14 AM IST
Highlights

టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ  పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఢిల్లీ : ఐటీ రంగంలో మరో కుదుపు ఏర్పడింది. టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ కు సీఈఓగా పనిచేస్తున్న రాజేష్ గోపీనాథన్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఐటీ రంగాలలో దిగ్గజ సంస్థగా ఉన్న టిసిఎస్ కు  గోపీనాథన్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.  గోపీనాథన్ రాజీనామాతో ప్రస్తుతం సంస్థ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు  బీమా (బిఎఫ్ఎస్ఐ) వ్యాపార విభాగానికి ప్రెసిడెంట్,  గ్లోబల్ హెడ్ గా ఉన్న కె.  కృతివాసన్ ను ఈ పదవిలో తక్షణమే నియమిస్తున్నట్లుగా టిసిఎస్ ప్రకటించింది. అంతేకాదు గోపీనాథన్ ఈ యేడు సెప్టెంబర్ 15 వరకు తన పదవిలోనే కొనసాగుతారు. అప్పటివరకు తన వారసుడిగా నియమితులైన వారికి మద్దతుగా నిలుస్తారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా చూస్తారని టిసిఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.

టిసిఎస్ లో 22 ఏళ్లకు పైగా రాజేష్ గోపీనాథన్ తన అద్భుతమైన సేవలను అందించారు. ఎండిగా, సీఈఓగా గత ఆరేళ్లుగా తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహించారు. గోపీనాథన్  ఇప్పుడు తన ఇతర ఆసక్తుల కారణంగా కంపెనీని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు...అని టిసిఎస్ తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా ‘2023 మార్చి 16 నుంచి కె కృతివాసన్ ను భవిష్యత్తు సీఈఓ గా బోర్డు నామినేట్ చేసింది. కృతి వాసన్ 1989 నుంచి సంస్థలో ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేశారు. 2023-24లో ఎండీగా, సీఈఓ గా  నియమితులు అవుతారు.. అని  ఆ ప్రకటనలో వివరించారు.

Explainer: ఒకే వారంలో 3 బ్యాంకులు దివాళా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభానికి కారణాలేంటి, అగ్రరాజ్యం వణుకుతోందా..?

తన రాజీనామా మీద గోపీనాథన్ మాట్లాడుతూ.. ‘ నేను రాజీనామా చేయాలనుకునే నిర్ణయాన్ని చైర్మన్ తో మాట్లాడిన తర్వాతే తీసుకున్నాను. నా జీవితం తర్వాతి దశల్లో ఏం చేయాలనే దానిమీద నాకు ఎప్పటినుంచో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అందుకే,  చైర్మన్ తోనూ, బోర్డుతోను ఈ విషయాలు చర్చించాను.. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో సంస్థ నుంచి నేను వైదొలగడం సరైన సమయమని అనిపించింది. నేను అనుకున్న ఆలోచనలను ఆచరణలో పెట్టడానికే సంస్థ నుంచి బయటికి వెళుతున్నాను’ అని అన్నారు.

గోపీనాథన్ రాజీనామా మీద చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. టిసిఎస్ కు గోపీనాథన్ గట్టి పునాది వేశారు అని తెలిపారు. టిసిఎస్ ఎండిగా, సీఈవోగా గోపీనాథన్ బాధ్యతలు నిర్వహించిన కాలంలో పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టిసిఎస్ కు జత చేర్చారు. ఆ కాలంలోనే సంస్థ మార్కెట్ విలువ 70 మిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇలాంటి పనితీరుతో కంపెనీకి గోపీనాథన్ బలమైన నాయకత్వాన్ని అందించారు. గడిచిన ఆరేళ్లలో గోపీనాథన్ టిసిఎస్  తదుపరి దశవృద్దికి పునాదులు వేశారు. 

క్లౌడ్,  ఆటో మేషన్ వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం ద్వారా..  మా క్లయింట్లు తమ తమ వ్యాపారాల్లో వేగంగా మార్పులను చేసేందుకు సహాయపడ్డారు. టీసీఎస్ కు గోపీనాథన్ అందించిన సేవలను ప్రశంసిస్తున్నాను’ అని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ గా 2017 ఫిబ్రవరిలో చంద్రశేఖరన్ అని బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే టిసిఎస్ పగ్గాలను చంద్రశేఖరన్ నుంచి గోపీనాథన్ అందుకున్నారు.

కాగా, గోపీనాథన్ రాజీనామా  ఐటీ రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశీయ ఐటీ రంగంలో వారం వ్యవధిలోనే ఇది రెండో అతిపెద్ద మార్పు. నాయకత్వం మారడం రెండో ఘటన. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి గతవారం తన పదవికి రాజీనామా చేశాడు.  ఆ తర్వాత  భవిష్యత్తు ఎండి, సీఈవోగా టెక్ మహీంద్రాలో చేరారు.  టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరిస్తారు.

click me!