ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతుంది. తన పొటీ సంస్ధలకు ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావనలో ఆ సంస్థ ఉంది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ భారీ ప్రణాళికలతో ముందుకు వస్తోంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలు అందించడంతోపాటు ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే నిరుద్యోగులకు స్విగ్గీ శుభవార్త అందించింది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. దీంతో తన ఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేట్ రంగ సంస్థగా అవతరిస్తుంది.
గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటి ఈ సంగతి చెప్పారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వే తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని చెప్పారు.
వచ్చే 10-15 ఏళ్లల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది.
ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 4.5 లక్షలతో ప్రయివేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ. 5 లక్షల ఉద్యోగుల లక్ష్యం నెరవేరితే టీసీఎస్‌ను అధిగమించి అతిపెద్ద ప్రైవేటు రంగ యజమానిగా స్విగ్గీ దూసుకురానున్నది.