రెవెన్యూ పెంపే లక్ష్యం.. ఐటీ పేమెంట్స్ లో రిలీఫ్?

By telugu team  |  First Published Oct 19, 2019, 12:25 PM IST

వ్యక్తిగత ఆదాయం  పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట లభించనున్నది. ఇక నుంచి 5%, 10%, 20% శ్లాబులు మాత్రమే అమలులో ఉంటాయి. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తదుపరి ఎజెండాగా రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం రూ. 1.75 లక్షల కోట్లు తగ్గుతుందని అంచనా
 


దేశాన్ని గడగడలాడిస్తున్న ఆర్థిక మాంద్యం సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ఆదాయం పన్ను శ్లాబులను తగ్గించి ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. ఉద్యోగుల వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను భారీగా తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఇప్పటి వరకు 5%, 20%, 30%గా ఉన్న పన్ను శ్లాబ్‌లను 5%, 10%,  20 శాతానికే పరిమితం చేసేలా కేంద్రం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. మోదీ సర్కార్ తదుపరి అజెండా కూడా ఇదేనంటున్నాయి. ఈ మేరకు ‘వ్యక్తిగత ఆదాయం పన్ను’పై అధ్యయనానికి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ అన్ని కోణాల్లోనూ పరిశీలించాక ఈ ఏడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. 

Latest Videos

ప్రస్తుత పన్ను రేట్లను తగ్గించడంతోపాటు శ్లాబ్‌లను హేతుబద్ధం చేయాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. అయితే, శ్లాబులను తగ్గించడం ద్వారా కేంద్రానికి సుమారు రూ.1.75 లక్షల కోట్ల మేరకు ఆదాయం తగ్గిపోనుందని సమాచారం.
 
ఈ మొత్తం నష్టాన్ని కేంద్రమే భరించకుండా 58:42 పద్ధతిలో రాష్ట్రాలకు కూడా పన్ను ఆదాయంలో కోత పెడుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల పన్ను ఆదాయం తగ్గిపోనుంది. 

ఇదిలా ఉంటే, వ్యక్తిగత పన్ను శ్లాబుల తగ్గింపు విషయంపై ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ వివేక్‌ దేబరాయ్‌ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత పన్నును తగ్గించేందుకు త్వరలోనే చర్యలు తీసుకోవడం ఖాయం’ అని వివేక్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక శాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 

మరోపక్క పన్ను శ్లాబుల తగ్గింపు అనేది అసాధ్యమేమీ కాదని, బడ్జెట్‌ అవసరాలు, ద్రవ్యలోటు, ఆదాయ పరిస్థితిని అధ్యయనం చేశాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే చెప్పారు. 

ఆదాయం పన్ను తగ్గడం ద్వారా వినియోగదారుల వద్ద నగదు నిల్వలు పెరిగి, తద్వారా మార్కెట్లు పుంజుకుంటాయని తీసుకుంటామని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వివరించారు. కాగా, పన్ను రేట్ల తగ్గింపు ప్రతిపాదనను నోబెల్‌ పురస్కార గ్రహీత అభిజిత్‌ బెనర్జీ స్వాగతించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఈ నిర్ణయం అత్యావశ్యకంగా పేర్కొన్నారు.
 

click me!