అస్థిరత్వం ప్లస్ సెంటిమెంట్.. ఇళ్ల డిమాండ్ కుంగుబాటు

By telugu team  |  First Published Oct 19, 2019, 2:49 PM IST

స్థిరాస్తి రంగంలో తీవ్ర అస్థిరత నెలకొన్నదని ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది. రియాల్టీ రంగం సెంటిమెంట్ నోట్లరద్దు నాటి స్థాయికి పడిపోయింది. ఇళ్ల డిమాండ్ భారీ స్థాయిలో కుంగుబాటుకు గురవుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తి నిరాశావాదంలో చిక్కుకున్నది. వచ్చే ఆరు నెలలకూ ఆదే తరహా 'సీన్‌' నెలకొంటుందని ఫిక్కీ, నారెడ్కో, నైట్ ఫ్రాంక్ సంస్థల సంయుక్త సర్వే నిగ్గు తేల్చింది. 
 


దేశంలోని స్థిరాస్తి రంగంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తాజాగా ఒక సర్వే తేల్చింది. స్థిరాస్తి రంగానికి ఊతం ఇచ్చేలా పలు చర్యలు చేపడుతున్నట్టుగా సర్కారు, ఆర్బీఐ ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో స్థిరాస్తి రంగంపై మార్కెట్‌ సెంటిమెంట్‌ అంతకంతకు పడిపోతూ వస్తోందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నారెడ్కో, నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు కలిసి నిర్వహించిన సర్వే తెలిపింది.

జూలై-సెప్టెంబర్ మధ్య స్థిరాస్తి రంగపు సెంటిమెంట్‌ సూచీ 42 పాయింట్ల స్థాయికి పడి పోయి నోట్లరద్దు సమయం స్థాయికి చేరువైందని సర్వే విశ్లేషించింది. అంతకు ముందు రెండు త్రైమాసికాల్లో ఈ సూచీ వరుసగా 47, 62 పాయింట్ల స్థాయి వద్ద నిలిచిందని తెలిపింది. 2014 ఎన్నికల ముందు కాలంలోనూ, నోట్లరద్దు సమ యంలోనూ స్థిరాస్తి సెంటిమెంట్‌ సూచీ 41 పాయింట్ల స్థాయికి పడిపోయింది. ఈ ప్రతికూల వేళల తరువాత మళ్లీ సెంటిమెంట్‌ సూచీ ఇంత దిగువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రానున్న ఆరు నెలల కాలంలోనూ ఈ రంగంలో ఇదే తరహా నిరాశావాదం కొనసాగే అవకాశం ఉందని వివరించింది. 

Latest Videos

తాజాగా స్థిరాస్తి రంగం సూచీ కనిష్ట స్థాయిలకు చేరవవడం చూస్తుంటే రియాల్టీ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందన్న విషయం అర్థమవుతోందని సర్వే నివేదిక తెలిపింది. స్థిరాస్తి రంగ సెంటిమెంట్‌ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే రియాల్టీలో ఆశావాద దృక్పథం నెలకొని ఉందని.. 50 పాయింట్లుగా ఉంటే సెంటిమెంట్‌ తటస్థంగా ఉన్నట్టుగాను.. 50 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే ఈ రంగంలో నిరాశావాదం నెలకొని ఉన్నట్టుగా పరిశ్రమ వర్గాలు భావిస్తుంటాయి. దేశంలో వాణిజ్య స్థిరాస్తి విభాగం డిమాండ్‌ మాత్రం స్థిరంగా ఉందని సర్వే తెలిపింది.

ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యానికి తోడు మందగమన పరిస్థితుల వల్ల స్థిరాస్తి డిమాండ్‌ అంతకంతకు పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమ్మకాలపై ప్రభావం కనబడుతోందని నైట్‌ఫ్రాంక్‌ సంస్థ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజాల్‌ చెప్పారు. స్థిరాస్తి రంగంలో పాటు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు తోడు రానున్న ఆరు నెలల కాలంలో కూడా నిరాశావాదం తొలిగిపోయే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ రంగంలోని భాగస్వాములు తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆయన అన్నారు. 

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చాలా ప్రోత్సాహక చర్యలు అందుబాటు ధరల్లో లభించే గృహ నిర్మాణాలకే పరిమితం కావడంతో నాన్‌ ఎఫోర్డబుల్‌ హౌసింగ్‌ విభాగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని నైట్‌ఫ్రాంక్‌ సంస్థ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజాల్‌ అన్నారు. సర్కారు పలు చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ అవి వినియోగదారుల్లో విశ్వాసాన్ని నింపలేకపోతోందని అన్నారు. సర్కారు చర్యలు సప్లయి పెంపువైపే ఉన్నాయని.. డిమాండ్‌ పెంపు వైపు చర్యలు అవసరమని ఆయన అన్నారు.

దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో గృహ అమ్మకాలు గణనీయంగా 25 శాతం మేర తగ్గినట్టుగా ప్రముఖ ప్రాపర్టీ బ్రోకరేజ్‌ సంస్థ ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు 65,799 యూనిట్లుగా నమోదు అయినట్టు సంస్థ తెలిపింది. అంతకు ముందు ఇదే సమయంలో అమ్మకాలు 88,078 యూనిట్టుగా నిలిచినట్టు తెలిపారు.

ఇదే సమయంలో కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభం కూడా 45 శాతం మేర పడిపోయినట్టు సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది. అంతకుముందు జెఎల్‌ఎల్‌, ఆనరాక్‌ సంస్థలు కూడా తమ అధ్యయనం వివరాలను వెల్లడిస్తూ గృహ అమ్మకాలు పడిపోయినట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. గృహ అమ్మకాలు పడిపోయిన ప్రధాన నగరాలలో ముంబై , పుణె, నోయిడా (గ్రేటర్‌ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, గురుగ్రామ్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలు ఉన్నట్టుగా ప్రాప్‌ టైగర్‌ సంస్థ వెల్లడించింది.

click me!