
రష్యా - ఉక్రెయిన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ నేడు వారంలో రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం ఉదయం పతనంతో ప్రారంభమై చివరికి నష్టాలలో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో 17,092 వద్ద ముగిశాయి.
ఉదయం బిఎస్‌ఈ 30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ 1024 పాయింట్ల పతనంతో 57 వేల దిగువన 56,659 వద్ద ప్రారంభమైంది, అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 299 పాయింట్లు పడిపోయి 16,907 వద్ద 17 వేల దిగువన ప్రారంభమైంది. దీని తర్వాత రోజంతా ట్రేడింగ్ నష్టాలలో సాగింది. అయితే ప్రారంభం నుండి భారీ పతనం మొదలై చివరకు కొంత ఉపశమనం పొందింది. సోమవారం సెన్సెక్స్ 149 పాయింట్లు పడిపోయి 57,683 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 70 పాయింట్ల పతనంతో 17,206 వద్ద ముగిసింది.
ఒక్క ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు రష్యా-ఉక్రెయిన్‌లో తీవ్రరూపం దాల్చిన సంక్షోభ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై పడింది. ఆసియా నుంచి యూరప్ వరకు షేర్ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి. భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఊగిసలాటతో ప్రారంభం కాగా యూరోపియన్ మార్కెట్లను పరిశీలిస్తే ATSE 0.39 శాతం, CAC 2.04 శాతం, DAX 2.07 శాతం చొప్పున నష్టపోయాయి. ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే ఎస్‌జిఎక్స్ నిఫ్టీ 1 శాతం నష్టపోగా, హ్యాంగ్ సెంగ్ 3.23 శాతం క్షీణించింది. మరోవైపు షాంఘై ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ 1.19 శాతం నష్టపోగా, తైవాన్ టీ సెక్టార్ 50 ఇండెక్స్ 1.87 శాతం నష్టపోయింది.
ముడి చమురు ధర 96 డాలర్లు దాటింది
స్టాక్ మార్కెట్లలో క్షీణత కొనసాగుతుండగా.. మరోవైపు మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధర 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 96 డాలర్లు దాటింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాద ప్రాంతాల స్వాతంత్రాన్ని గుర్తించారు.
ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు స్వల్పంగా లాభపడితే.. బీపీసీఎల్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ & పిఎస్యు బ్యాంక్ సూచీలు 1-3 శాతం తగ్గడంతో నష్టాల్లో ముగిశాయి. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1.6 శాతం పడిపోయాయి.