
నెలకు రూ.15,000 కంటే ఎక్కువ మూల వేతనం(బేసిక్ శాలరీ) కలిగిన సంఘటిత కార్మికుల కోసం ఈపీఎఫ్‌ఓ ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈపీఎఫ్ఓ పరిధిలోకి తప్పనిసరిగా రాని ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్-95 పరిధిలోకి రాని ఉద్యోగుల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. రూ.15,000 కంటే ఎక్కువ బేసిక్ వేతనం కలిగిన, 1995 నాటి పెన్షన్ స్కీమ్ ఈపీఎస్-95 పరిధిలోకి రాని ఉద్యోగుల కోసం ఈ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో గౌహతి వేదికగా జరగనున్న ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక మండలి సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరే సమయంలో రూ.15వేల కంటే తక్కువ బేసిక్ వేతనం అందుకున్న వారికి ఈపీఎస్-95 కింద పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఉద్యోగంలో చేరే సమయంలో అంతకంటే బేసిక్ వేతనం ఎక్కువగా ఉంటే వారికి ఈ స్కీమ్ వర్తించదు. కానీ రూ.15,000 కంటే ఎక్కువ బేసిక్ వేతనం ఉన్నప్పటికీ, తక్కువ మొత్తంలో పెన్షన్ పొందవలసివస్తుంది.
బేసిక్ వేతనం ఎంత ఉన్నప్పటికీ రూ.15,000 వేతనం ఆధారంగా అందులో 8.33 శాతం చొప్పున మాత్రమే ఈపీఎస్-95లో జమ అవుతుంది. దీంతో పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా కనిపిస్తోంది. దీంతో అధిక పెన్షన్ పొందడానికి ఈపీఎస్‌లో ఎక్కువ మొత్తం జమ చేసే వీలు కల్పించాలన్న డిమాండ్లు ఉద్యోగుల నుండి వస్తున్నాయి. దీంతో 2021 నవంబర్ నెలలో CBT సబ్ కమిటీని నియమించగా, ఈ కమిటీ బోర్డుకు నివేదికను ఇచ్చింది. ఇదివరకు బేసిక్ వేతన పరిమితి రూ.6500 కాగా, 2014 సెప్టెంబర్ 1వ తేదీన సవరించి రూ.15,000కు పెంచారు. అయితే మరో రూ.10,000 పెంచి, రూ.25,000కు సవరించాలని చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి.