అదే.. నెగెటివ్ గ్రోథ్.. కోలుకోని ‘కీ’ సెక్టార్స్

By Arun Kumar PFirst Published Jan 1, 2020, 11:51 AM IST
Highlights

ఆర్థిక మాంద్యం సంకేతాలు మరింత బలోపేతం అవుతున్నాయే గానీ తగ్గడం లేదు. దీనికి నిదర్శనం నవంబర్ నెలలోనూ ఎనిమిది కీలక రంగాల అభివ్రుద్ధి వరుసగా నాలుగో నెలా ప్రతికూల వృద్ధి నమోదు కావడమే. నవంబర్‌లో కీలక రంగాల అభివ్రుద్ధి -1.5 శాతంగా నమోదైంది.

న్యూఢిల్లీ: దేశంలోని మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ కీలక రంగాల వృద్ధి మరోసారి ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. మౌలిక రంగ పరిశ్రమలు కోలుకున్న సంకేతాలు మచ్చుకైనా కాన రావడం లేదు. వరుసగా నాలుగో నెలా ప్రతికూల వృద్ధికే పరిమితమయ్యాయి. 2019 ఆగస్టులో మొదలైన నెగెటివ్‌ గ్రోత్‌..నవంబర్‌లోనూ కొనసాగింది. ఎనిమిది కీలక రంగాల ఉత్పాదక వృద్ధి -1.5 శాతంగా నమోదైంది. 

మంగళవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లోని పరిశ్రమల పనితీరు, ఉత్పాదక సామర్థ్యం పడిపోయాయి. బొగ్గు విభాగం 2.5%, ముడి చమురు 6%, సహజ వాయువు 6.4%, ఉక్కు 3.7%, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ 5.7% క్షీణించాయి. 

2018 నవంబర్‌లో 3.3% అభివృద్ధిని కనబరిచిన కీలక రంగాలు ఈసారి మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చాయి. 2018 నవంబర్‌ నుంచి ముడి చమురు ఉత్పత్తి ప్రతికూల గణాంకాల్లోనే కొనసాగుతున్నది. సహజ వాయువు 2019 ఏప్రిల్‌ నుంచి, బొగ్గు ఉత్పత్తి జూలై నుంచి పతనమయ్యాయి. 

కాగా, 2018 నవంబర్‌తో పోల్చితే సిమెంట్‌ ఉత్పత్తి 8.8% నుంచి 4.1 శాతానికి దిగజారింది. అయితే రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 3.1% పెరుగగా, ఎరువుల ఉత్పత్తి 13.6% ఎగబాకింది. ఇక 2019 ఏప్రిల్‌-నవంబర్‌ వ్యవధిలో కీలక రంగాల వృద్ధిరేటు 5.1% వద్ద యథాతథంగా ఉన్నది. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది కీలక రంగాల వాటా 40.27%గా ఉన్న విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని పరిశీలించి చూస్తే కీలక రంగాల వృద్ధిలో జీరో శాతం వృద్ధి నమోదైంది. 2018 ఇదే కాలంలో కీలక రంగాలు 5.1 శాతం వృద్ధిని నమోదు చేయగా.. 2019లో కూడా కీలక రంగాలు ఇదే స్థాయి వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే భవిష్యత్‌లో ఈ వృద్ధి పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

click me!