‘జియో మార్ట్’ ప్రారంభం ఈ ఏడాదే..ఆ రెండు సంస్థలకు రిలయన్స్‌ రియల్ చాలెంజ్

By Arun Kumar PFirst Published Jan 1, 2020, 11:48 AM IST
Highlights

రిలయన్స్ మరో సంచలనానికి తెర తీసింది. ఈ ఏడాది జియో మార్ట్ పేరిట కొత్త ఈ కామర్స్ సంస్థను ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు రియల్ చాలెంజ్ కానున్నది. 

ముంబై: ముకేశ్‌ అంబానీ  నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఏడాదిలో మరో సంచలనానికి నాంది పలికింది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు  షాకిస్తూ ఈ కామర్స్ రంగంలో  ‘జియో మార్ట్‌’ (దేశ్ కి  నయీ దుకాణ్‌) పేరిట మరో సంస్థను ప్రారంభించింది. 

దీంతో రిలయన్స్‌ జియోతో దూసుకుపోయిన అంబానీ తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టినట్లయింది. జియో మార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు. "దేశ్ కి నయీ దుకాణ్" అనే  ట్యాగ్‌లైన్‌ తో జియో మార్ట్‌ను రిలయన్స్‌ ఆవిష్కరించింది.
 అంతేకాదు తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాలని జియో వినియోగదారులకు రిలయన్స్ జియో మార్ట్ ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్‌ ఇపుడు జియో మార్ట్‌ ద్వారా మరోసారి విధ్వంసానికి తెరతీసింది.

ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి రూ.3వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ పొందవచ్చు. 

ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లో నవీ ముంబై, థానే, కళ్యాణ్‌ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది.  హోం డెలివరీ, రిటన్‌ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవలను కూడా అందిస్తోంది.  రిలయన్స్‌ జియో మార్ట్‌ ద్వారా 50వేలకు పైగా సరుకులను విక్రయించాలని  భావిస్తోంది. 

ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న రిటైలర్లను రిలయన్స్‌ ఈ సేవలో భాగస్వామ్యం చేయనుంది. కాగా రిలయన్స్ రిటైల్, జియో సంయుక్తంగా దేశంలో కొత్త వాణిజ్య సంస్థను ప్రారంభించనున్నట్లు ముకేష్ అంబానీ 2019 జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

click me!