యుద్ధ భయాలు: రూ.2 లక్షల కోట్ల మదుపర్ల సంపద ‘హాంఫట్’!

By rajesh yFirst Published Jun 18, 2019, 11:52 AM IST
Highlights


అమెరికాకు చెందిన 28 వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధం నెలకొంటుందన్న భయం.. హర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు.. రుతుపవనాల్లో ఆలస్యం వంటి కారణాలు స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయింది. మదుపర్లు రూ.2. లక్షల కోట్ల మేరకు హరీమన్నది.

ముంబై: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు.. మదుపరుల సంపదను రూ.2 లక్షల కోట్లకుపైగా మింగేశాయి. సెన్సెక్స్ 491.28 పాయింట్లు క్షీణించడంతో బీఎస్‌ఈలో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్కరోజే రూ.2,00,258.81 కోట్లు హరించుకు పోయి, రూ.1,50,09,329.19 కోట్లకు దిగజారింది. 

భారత్-అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు.. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బ తీశాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు, వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ) రద్దు వంటి నిర్ణయాల నేపథ్యంలో 28 రకాల అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. 

అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు.. సూచీలను కుప్పకూల్చాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలను తెచ్చిపెట్టాయి. దీనికి నగదు కొరత తోడైంది అని బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ టెక్నికల్ రిసెర్చ్ విశ్లేషకుడు జతిన్ త్రివేది అభిప్రాయపడ్డారు. 

దీనికి తోడు రుతు పవనాల ఆలస్యం, హార్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడులు కూడా మదుపర్లను ఒకింత భయాందోళనకు గురిచేశాయని మార్కెట్ విశ్లేషకులు అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో కొత్త పోరుకు దారి తీస్తుందన్న ఆందోళనలు మదుపరులను వెంటాడాయి. 

ఈ క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 491.28 పాయింట్లు కోల్పోయి 38,960.79 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 151.15 పాయింట్లు పడిపోయి 11,672.15 వద్ద స్థిరపడ్డాయి. 

ఒకానొక దశలో సెన్సెక్స్ 38,911.49 పాయింట్ల కనిష్ఠాన్ని, నిఫ్టీ 11,657.75 పాయింట్ల కనిష్ఠాన్ని తాకాయి. అలాగే గరిష్ఠంగా 39,540.42 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్, 11,844.05 పాయింట్ల మార్కును నిఫ్టీ అందుకున్నాయి. గత వారం నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 796.02 పాయింట్లు, నిఫ్టీ 234.05 పాయింట్లు పతనమైన సంగతి విదితమే. 

మెటల్, ఎనర్జీ రంగాల షేర్లు 3, 2 శాతాలకుపైగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 1.35 శాతం మేర కోల్పోయాయి. టాటా స్టీల్ షేర్ విలువ ఐదు శాతానికిపైగా పడిపోయింది. 

వేదాంత, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, మారుతి, ఎల్‌అండ్‌టీ షేర్లు 3.33 శాతం వరకు విలువను చేజార్చుకున్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది, ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఇక నేలకు పరిమితమైన జెట్ ఎయిర్‌వేస్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతూనే ఉన్నది. సోమవారం మరో 18 శాతం పతనమవగా, బీఎస్‌ఈలో 16.76 శాతం నష్టపోయి రూ.68.30 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 18 శాతం క్షీణించి రూ.66.95 వద్ద స్థిరపడింది. 

ఒకానొక దశలో బీఎస్‌ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ విలువ 19.56 శాతం దిగజారి రూ.66ను తాకింది. షేర్ విలువ దారుణంగా నష్టపోతున్న నేపథ్యంలో గత వారం స్టాక్ ఎక్సేంజ్‌లు.. ఈ నెల 28 నుంచి ట్రేడింగ్‌పై ఆంక్షలు తేవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత 11 రోజుల్లో జెట్ ఎయిర్‌వేస్ మార్కెట్ విలువ రూ.937.13 కోట్లు ఆవిరైపోయింది. 

మే 30 నుంచి ఇప్పటిదాకా జెట్ ఎయిర్వేస్ షేర్ విలువ 54.72 శాతం కరిగిపోయింది. నాటి విలువ రూ.150.85గా ఉన్నది. రూ.8,500 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న జెట్ ఎయిర్‌వేస్.. రెండు నెలల కింద విమానయాన సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ వరుసగా క్షీణిస్తున్నది. గత రెండు రోజుల నష్టాలను కొనసాగిస్తూ సోమవారం కూడా పడిపోయింది. ఫలితంగా గత మూడు రోజుల్లో 57 పైసలు పతనమవగా, ఈ ఒక్కరోజే 11 పైసలు చేజార్చుకున్నది. ఈ క్రమంలోనే డాలర్ పై రూపాయి విలువ రూ.69.91 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం, ప్రధాన దేశాల కరెన్సీలతో డాలర్ విలువ పడిపోవడం.. రూపాయికి కాస్త కలిసొచ్చే అంశమని ఫారెక్స్ నిపుణులు అంటున్నారు.

click me!