సెమీకాన్ ఇండియా 2024 కు యూపీ సర్కార్ ఆతిథ్యం

By Arun Kumar PFirst Published Sep 10, 2024, 11:14 PM IST
Highlights

సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు యూపీ సర్కార్ సెమీకాన్ ఇండియా 2024కి ఆతిథ్యం ఇవ్వనుంది. 

లక్నో. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది యోగి ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024 ని నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం. 

సెమీకాన్‌తో పాటు ఎలక్ట్రానికా ఇండియా 2024 ను కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పాల్గొంటున్నారు.

Latest Videos

బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వర్క్ ఫోర్స్ పెవిలియన్ డెవలప్‌మెంట్ పెవిలియన్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

సెమీకాన్ ఇండియా 2024లో 17 దేశాల నుండి 255 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో అపార అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చిప్ తయారీతో సహా వివిధ పరిశ్రమలను రాష్ట్రంలోకి ఆకర్షించే దిశగా ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. యూపీ ట్రేడ్ షో 2024 కంటే ముందే ఈ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ యూపీకి మంచి ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అపార అవకాశాలపై దృష్టి

సెమీకాన్ ఇండియా 2024లో భాగంగా సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శనలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ తయారీదారులు తమ స్టాల్‌లను ఏర్పాటు చేస్తారు. తొలి రోజైన 11న ప్రధాని మోడీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించనున్నారు. అనంతరం స్మార్ట్ తయారీపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

భారతదేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థపై ప్రజెంటేషన్ ఉంటుంది. రెండో రోజు క్రాస్ రీజినల్ భాగస్వామ్యాలు, ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ ఎలక్ట్రానిక్స్, సరఫరా గొలుసు నిర్వహణ, మైటీ ఇండస్ట్రీ అకాడెమియా వర్క్‌షాప్‌లు, స్థిరత్వ సెషన్‌లు నిర్వహిస్తారు. చివరి రోజైన 13న మైక్రోన్ ద్వారా ప్యాకేజీ తయారీ బూట్‌క్యాంప్, ఐఈఎస్‌ఏ ద్వారా సెమీకండక్టర్ ప్రయాణంపై ప్రజెంటేషన్ ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ & ఎలక్ట్రానిక్స్ విభాగం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీఈఎల్‌సీ) పాల్గొంటున్నాయి. 145 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, చిప్ తయారీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడిదారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తారు. బుధవారం జరిగే రెండు సెషన్‌లలో సీఎం యోగి పాల్గొంటారు.

పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి మార్గం సుగమం

సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్‌ను ఎలక్ట్రానికా ఇండియా, ప్రాడక్ట్రానికా ఇండియాతో కలిపి నిర్వహిస్తారు. ఇవి ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వాణిజ్య ప్రదర్శనల్లో ఒకటి. ఇప్పటివరకు జరిగిన సెమీకాన్ ఇండియాలో 200 కంపెనీలకు చెందిన 24 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 

అన్ని సెమీకాన్ ఎక్స్‌పోజిషన్‌ల మాదిరిగానే సెమీకాన్ ఇండియా కూడా విస్తృత ప్రదర్శనలు, సమాచార కార్యక్రమాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది. దీనిలో దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు పాల్గొంటాయి. స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను పరిశీలిస్తారు. దీని ద్వారా వారి వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కొత్త అవకాశాలను అన్వేషిస్తారు.

దేశంలో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం, దేశీయ డిమాండ్‌ను తీర్చడం కోసం భారత సెమీకండక్టర్ మిషన్ (ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చొరవ) AMD, అప్లైడ్ మెటీరియల్స్, మైక్రోన్ టెక్నాలజీ వంటి పెద్ద కంపెనీలను చిప్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించింది.

భారతదేశంలోని సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడటానికి సెమీ, మెస్సే ముయూన్చెన్ ఇండియా, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఇఎల్‌సిఐఎన్‌ఏ ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా ఉన్నాయి. 2026 నాటికి ఈ రంగంలో చిప్ మార్కెట్ 55 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రంగంలోని అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సెమీకండక్టర్ పరిశ్రమలను ఆహ్వానిస్తోంది.

సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ తయారీకి ఉత్తరప్రదేశ్ అనువైన ప్రదేశం ఎందుకంటే...

  • ఉత్తరప్రదేశ్‌లో సెమీకండక్టర్ తయారీకి అపార అవకాశాలున్నాయి. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి యోగి ప్రభుత్వం సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై దృష్టి సారించింది.
  • ఈ మేరకు రాష్ట్రంలో తొలిసారిగా సెమీకండక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
  • భారత ప్రభుత్వం ఆమోదించిన మూలధన సబ్సిడీపై 50 శాతం అదనపు మూలధన సబ్సిడీని యూపీ సెమీకండక్టర్ విధానం కింద అందిస్తున్నారు.
  • కంపౌండ్ సెమీకండక్టర్స్/సిలికాన్ ఫోటోనిక్స్/సెన్సార్స్/ఏటీఎంపీ/ఓఎస్‌ఏటీలకు 75 శాతం ల్యాండ్ రిబేట్‌ను కూడా ఈ విధానం కింద అందిస్తున్నారు.
  • డ్యూయల్ గ్రిడ్ నెట్‌వర్క్‌తో పాటు 10 సంవత్సరాల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం రాయితీని కల్పిస్తున్నారు.
  • అంతేకాకుండా 25 సంవత్సరాల పాటు అంతర్ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు, ప్రసారం, వీలింగ్ ఛార్జీలపై 50 శాతం రాయితీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముపై 100 శాతం రాయితీ, వడ్డీపై 5 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.7 కోట్లు) అందిస్తున్నారు.
  • 2020లో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రోత్సహించడం, ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయడం, ఈఎంసీ నిర్మాణాన్ని అభివృద్ధి చేయడం వంటి వాటిపై సబ్సిడీతో సహా అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌కు సొంత ఎఫ్‌డీఐ విధానం ఉంది. దీని ద్వారా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది.
click me!