ఏ లోన్ కావాలన్నా ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌.. మిగతా బ్యాంకులు సైతం

By rajesh yFirst Published Aug 21, 2019, 11:41 AM IST
Highlights

భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఇంటి రుణం, పర్సనల్ లోన్, విద్యా రుణాలను మంజూరు చేసేందుకు బారులు తీరుతున్నాయి. ఆకర్షణీయంగా కనిష్ట వడ్డీరేట్లతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్‌ సందర్భంగా తన ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేయడంతోపాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి కనిష్ట స్ధాయిలో 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తామన్నది.

కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించే గడువును ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పొడిగించింది. ఇక ఖాతాదారులకు ఆన్‌లైన్‌ సేవలు అందించే తన యోనో యాప్‌ ద్వారా రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం​ అందించనున్నట్టు పేర్కొంది. 

ఈ యాప్‌ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే రుణం మొత్తం వారి ఖాతాల్లోకి చేర్చనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యా రుణం కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గుతుందని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది.

వివిధ బ్యాంకులు ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్‌59మినిట్స్‌’ పోర్టల్‌లో గృహ, వాహన.. ఇతర రిటైల్‌ రుణాలు కూడా భాగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి సంస్థల (ఎంఎస్‌ఎంఈలు)కు రూ.కోటి వరకు రుణాలను 59 నిమిషాలు లేదా గంట కంటే తక్కువ సమయంలోనే సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నారు. 

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), యూనియన్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని పీఎస్‌బీలు ఈ మొత్తాన్ని రూ.5 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించాయి. కొన్ని రిటైల్‌ రుణాలను పోర్టల్‌ ద్వారా సులభంగా మంజూరు చేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. పోర్టల్‌లో సూత్రప్రాయ ఆమోదం లభించాక,  నచ్చిన బ్యాంక్‌ను ఎంచుకునే సౌలభ్యం రుణగ్రహీతకు ఉంది. రుణ ఆమోద లేఖ అందిన తర్వాత.. 7-8 పని దినాల్లో రుణ మొత్తం మంజూరు చేస్తున్నారు.

click me!