1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

By Sandra Ashok KumarFirst Published Nov 18, 2019, 1:02 PM IST
Highlights

సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.  

రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం.. తమ ముడి చమురు, గ్యాస్ ఉత్పాదక దిగ్గజం ఆరామ్కో పబ్లిక్ ఇష్యూ విలువను ప్రకటించింది. ఆదివారం వెల్లడైన ఈ వివరాల ప్రకారం ఆరామ్కో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) విలువ 1.71 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉండనున్నది. ఇప్పటిదాకా ఏ దేశంలోనూ ఈ స్థాయి ఐపీవో రాకపోవడం గమనార్హం.

ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆరామ్కో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 3న సౌదీ రెగ్యులేటర్లు.. ఆరామ్కో ఐపీవోకు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. నిజానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. ఆరామ్కో ఐపీవో 2 లక్షల కోట్ల డాలర్లుగా ఉండాలని కోరుకున్నారు.

also read మార్చికల్లా మహారాజా ఔట్.. భారత్ పెట్రోలియం కూడా..

అయితే తొలుత 5 శాతం షేర్లను విక్రయించాలని చూసినా.. ఇప్పుడు 1.5 శాతానికే సరిపెట్టడంతో యువరాజు లక్ష్యం నెరవేరకుండా పోయింది. దేశీయ ఎక్సేంజ్‌లో 2 శాతం వాటా, విదేశీ ఎక్సేంజ్‌లో 3 శాతం వాటాను అమ్మాలని అప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆరామ్కో ప్రకటించింది. 

దీంతో ఆరామ్ కో స్థానిక స్టాక్ ఎక్సేంజ్ తడవుల్‌లోనే షేర్లను అమ్మకానికి పెట్టనున్నది. 8 నుంచి 8.5 డాలర్ల మధ్య ఒక్కో షేర్ ధరను నిర్ణయించారు. 2016 నుంచి ఈ ఐపీవో వాయిదాలు పడుతూ వస్తున్నది. ఆరామ్కో గతేడాది 111.1 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని పొందింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో గతంతో పోల్చితే 18 శాతం పడిపోయి 68.2 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఆరామ్కో ఐపీవోకు భారీ విజయాన్ని అందించేలా సౌదీ సర్కారు కృషి చేస్తున్నది. 

also read ఇండియా యాజ్ దట్ గట్స్.. దశాబ్ధిలో వృద్ధి శరవేగం: బిల్ గేట్స్

ఇప్పటికే రియాద్‌లోని వందలాది స్థానిక ఫండ్ మేనేజర్లను ఆకట్టుకునేలా సంస్థ సీఈవో నాజర్ ప్రత్యేక ప్రణాళికల్ని అమలు పరుస్తుండగా, ఈ వారం ఐరోపాలో రోడ్‌షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం 2014లో వచ్చిన అలీబాబా ఐపీవోనే ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ. 25 బిలియన్ డాలర్ల విలువతో ఈ-కామర్స్ దిగ్గజం స్టాక్ మార్కెట్ల తలుపు తట్టింది. ఇప్పుడు ఆ రికార్డును ఆరామ్కో బద్దలు కొట్టనున్నది.

click me!