ఇండియా యాజ్ దట్ గట్స్.. దశాబ్ధిలో వృద్ధి శరవేగం: బిల్ గేట్స్

By Sandra Ashok Kumar  |  First Published Nov 18, 2019, 11:12 AM IST

పదేళ్లలో భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాకుడు బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్‌ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఫార్మా రంగ పనితీరు బాగుందని కితాబిచ్చారు.


న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుని చాలా వేగంగా ప్రగతి సాధిస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగించింది. గిరాకీ కరువైంది.. ప్రైవేటు పెట్టుబడులు తగ్గాయి. పరిశ్రమల వృద్ధి కుంటుపడుతోంది. 

రానున్న కాలంలో వృద్ధి మరింత క్షీణించ వచ్చునన్న ప్రతికూల అంచనాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు శరవేగంగా వృద్ధి చెందే సత్తా ఉందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అన్నారు. 

Latest Videos

undefined

also read  ఆర్ కామ్ దివాళా .... అనిల్ అంబానీ రాజీనామా

వచ్చే దశాబ్దిలో భారత్‌ తన సత్తాను చాటుకుంటుందని బిల్ గేట్స్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మెరుగైన వృద్ధి రేటు నమోదు కావడం వల్ల అనేక మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడతారన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా, వైద్యం కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. 

‘స్వల్పకాలిక వృద్ధి గురించి నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు. కానీ వచ్చే దశాబ్దిలో శరవేగ వృద్ధిని సాధించే సత్తా భారత్‌కు ఉంది. ఇది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెస్తుంది. విద్య, ఆరోగ్యం వంటి ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులకు అనుమతిస్తుంది’ అని గేట్స్‌ పేర్కొన్నారు.

దేశంలో అమలవుతున్న ఆధార్‌ వ్యవస్థను బిల్ గేట్స్ ప్రత్యేకంగా ప్రశంసించారు. యూపీఐ వ్యవస్థకూ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఆర్థిక సర్వీసులు, ఫార్మా రంగంలో భారత్‌ పనితీరు బాగుందన్నారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి భారతదేశానికి వచ్చిన బిల్ గేట్స్ పీటీఐ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

 

దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని తక్కువ స్థాయి వృద్ధి రేటు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వివిధ రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్‌ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సానుకూల అంచనాలను ప్రకటించడం సాంత్వన కలిగించే అంశం. భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం బిల్‌గేట్స్‌ వచ్చారు. 

వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ మార్గదర్శకంగా ఉందని బిల్‌ గేట్స్‌ అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే విషయంలో భారత్‌ ప్రభావవంతమైన సహకారం అందిస్తోందన్నారు. భారత్‌ గురించి ఆలోచించినప్పుడు చాలా మంది ఐటీ సర్వీసుల గురించి మాట్లాడతారని, కానీ తక్కువగా కనిపిస్తూ ఎక్కువ ప్రభావితం చేసే వ్యాక్సిన్‌ మాన్యుఫ్యాక్చరర్లు ఇక్కడ ఉన్నారన్నారు. 

also read ఈ- కామర్స్ దిశగా రిలయన్స్ స్పీడప్: హైదరాబాదీ స్టార్టప్ కైవసం ?

సెరమ్‌తోపాటు భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ వంటి డజను కంపెనీలు వ్యాక్సిన్ల తయారీతో ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుస్తున్నాయని బిల్ గేట్స్ తెలిపారు. బిల్‌ అండ్‌ మెలింద గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించిన బిల్‌గేట్స్‌ దీని కోసం 3,500 కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి కోసం ఈ ఫౌండేషన్‌ పని చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, సానిటేషన్‌, వ్యవసాయం, ఆర్థిక సేవలు వంటి విభాగాల్లోనూ సేవలు అందిస్తోంది.దేశంలో చవకగా ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి ప్రైవేటు రంగ  ఇన్నోవేషన్‌లతోపాటు టెక్నాలజీ వంటి డిజిటల్‌ సాధనాల వినియోగం ఎంతో దోహదపడుతుందని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.

ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లోని కొన్ని ప్రైవేటు కంపెనీలను కలిసి నూతన ఇన్నోవేషన్ల గురించి తెలుసుకుంటున్నానని చెప్పారు.పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చెల్లింపులను డిజిటలైజేషన్‌ చేయడం, శానిటేషన్‌, పోలియో నిర్మూలన వంటివి చేపట్టిన ప్రభుత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశంలో విజయవంతంగా అమలు చేసిన ఆలోచనలను ఆఫ్రికా ఖండానికి తీసుకువెళ్లనున్నట్టు ఆయన చెప్పారు.

click me!