
Chip Shortage: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఇప్పుడు ఆ సమస్యపై పుండుపై కారం చల్లినట్లు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ సంక్షోభం పెరగే చాన్స్ ఉందని మూడీస్ అనలిటిక్స్ నివేదిక పేర్కొంది.
రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా సెమీ కండక్టర్స్, చిప్ప్ తయారీకి పెద్ద ఎత్తున ముడి పదార్థాలను తయారు చేస్తాయి. ప్రపంచంలోని 44 శాతం పల్లాడియం రష్యా నుండి వస్తుంది. ఇక 70 శాతం నియాన్ గ్యాస్ ఉక్రెయిన్ నుండి వస్తుంది. స్టీల్ ఇండస్ట్రీ నుంచి ఉప ఉత్పత్తిగా తయారయ్యే నియాన్ గ్యాస్ ను చిప్స్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
పల్లాడియం, నియాన్ గ్యాస్ ఈ రెండూ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీకి ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఇతర వస్తువులను తయారు చేయడానికి చిప్‌లను ఉపయోగిస్తారు. రెండు దేశాల మధ్య పోరు కారణంగా ప్రపంచ స్థాయిలో చిప్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉందని మూడీస్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో వాడే మరో గ్యాస్ క్రిప్టాన్ ప్రపంచ సరఫరాలో నలభై శాతం ఉక్రెయిన్ నుండి వస్తుంది. సెమీకండక్టర్ ఉత్పత్తికి ఉపయోగించే ఈ గ్యాస్ ధర యూనిట్ కు 8.64 డాలర్ల చొప్పున పెరిగింది.
ఏడేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి.
దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం 2014-15లో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో నియాన్ గ్యాస్ ధర చాలా రెట్లు పెరిగింది. దీన్ని బట్టి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సెమీకండక్టర్ పరిశ్రమకు ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితి త్వరలో సాధారణ పరిస్థితి రాకపోతే, చిప్స్ పరిశ్రమలో భారీ కొరత ఉండే అవకాశం ఉంది.
చిప్ కొరత వల్ల తలెత్తే నష్టాలు ఇవే..(Chip Shortage)
>> వాహనాలలో సెమీకండక్టర్ చిప్స్ ఉపయోగిస్తారు. చిప్‌ల కొరత కారణంగా ఆటో కంపెనీల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. అదే సమయంలో, తక్కువ సరఫరా కారణంగా, ధరలో పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి కంపెనీలు కార్ల ధరలు పెంచే అవకాశం ఉంది.
>> మొబైల్ ఫోన్లలో కూడా చిప్స్ భారీగా ఉపయోగిస్తారు. చిప్‌ల కొరత ద్వారా, మార్కెట్‌లో వాటి లభ్యత లేకపోవడంతో, కొత్త మోడళ్ల విడుదల ప్రభావితం కావచ్చు.
>> ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా చిప్స్ భారీగా వాడుతారు. అటువంటి పరిస్థితిలో, చిప్స్ లేకపోవడం వాటి ధరలు మరియు లభ్యతను ప్రభావితం చేస్తుంది.