
ముంబై: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. బ్యాంకులు, ఎగుమతిదార్ల నుంచి డాలర్‌కు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం. ఉదయం రూపాయి ట్రేడింగ్ సానుకూలంగానే ఆరంభమైంది. డాలర్‌తో పోల్చినపుడు, క్రితం ముగింపు స్థాయి 69.05తో పోలిస్తే నాలుగు పైసల లాభంతో 69.01 వద్ద మొదలైంది. ఆ తరవాత ఒడుదొడుకుల మధ్య చలించింది. తీవ్ర ఒత్తిడికి లోనవడంతో అంతర్గత ట్రేడింగ్‌లో డాలర్ రూ.69.13 స్థాయికి చేరింది. రూపాయి మారకపు విలువకు ఇది తాజా జీవనకాల కనిష్ఠ స్థాయి. అనంతరం కాస్త కోలుకుని.. ముగింపు దశలో 21 పైసల నష్టంతో 68.84 వద్ద స్థిరపడింది.
కొన్ని రోజులుగా ఇదే ధోరణి
కొన్ని రోజులుగా చమురు ధరలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు, బాండ మార్కెట్లలో ప్రతిఫలాలు పెరగడంతో సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో డాలరు బలోపేతమవుతోంది. విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్లేందుకు ఇవి కారణమవుతున్నాయి. ఇవ్వన్నీ కూడా రూపాయి క్షీణతకు దారి తీస్తున్నాయి. మున్ముందూ ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే డాలరు మారకపు విలువ రూ.70కి చేరే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా..
రూపాయి మారకం విలువ క్షీణించడం కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవని ఆర్థికవేత్తలు, కార్పొరేట్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కరెంటు ఖాతా లోటు, వాణిజ్యలోటు పెరుగుతాయి. ద్రవ్యలోటుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలా కీలక గణాంకాలన్నీ ఒత్తిడికి లోనైతే ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. అయితే భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండటం కొంత ఊరటే. తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే, ఈ మారక నిల్వల సాయంతో రూపాయి విలువ మరింత పతనమవ్వకుండా ఆర్‌బీఐ అడ్డుకునే వీలుంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రూపాయి మరింత క్షీణించకపోవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
అక్రమ లావాదేవీలకు అండ క్రిప్టో కరెన్సీ: ఆర్‌బీఐ
బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలకు అనుమతినిస్తే అక్రమ లావాదేవీలను ప్రోత్సహించినట్లు అవుతుందని సుప్రీంకోర్టుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలియజేసింది. అందుకే ఈ తరహా కరెన్సీలపై నిషేధం విధిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు నివేదించింది. డిజిటల్ రూపంలో క్రిప్టోకరెన్సీల లావాదేవీలు జరుగుతుంటాయి. వీటి వల్ల సంప్రదాయ కరెన్సీలకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటి నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాలని వివిధ కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.
క్రిప్టో కరెన్సీపై సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు విచారణ
క్రిప్టో కరెన్సీలపై నమోదైన ఫిర్యాదుల విషయమై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఫిర్యాదుల పరిశీలనకు కేంద్రం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆర్బీఐ తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ తెలియజేశారు. క్రిప్టోకరెన్సీల వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సాధ్యమైనంత త్వరగా తుది ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ ఫిర్యాదులన్నింటిపై స్పందన తెలియజేసేందుకు మూడు వారాల సమయాన్ని ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం అడిగాయి. దీనికి ధర్మాసనం సానుకూలంగా స్పందించి సెప్టెంబర్ 11న తుది విచారణ చేపడతామని తెలియజేసింది.
క్రిప్టో కరెన్సీ నిషేధంపై పిటిషన్లు ఇలా
క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 6న ఆర్బీఐ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లలో పెండింగ్‌లో ఉన్నవాటిని సుప్రీంకోర్టు స్వయంగా తనకు బదిలీ చేసుకుంది. క్రిప్టోకరెన్సీల నిషేధంపై ఆర్బీఐ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మున్ముందు ఎవరూ పిటిషన్ దాఖలు చేసినా స్వీకరించకూడదని కింది కోర్టులకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
పడిపోతున్న విదేశీ మారకం నిల్వలు
భారత దేశ విదేశీ మారకం నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. జులై 13తో ముగిసిన వారంలో 734.5 మిలియన్ డాలర్లు తగ్గి 405.075 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తెలిపింది. ఇంతక్రితం వారంలో కూడా 248.20 మిలియన్ డాలర్లు తగ్గాయి. 2018 ఏప్రిల్ 13న రికార్డు స్థాయిలో విదేశీ మారకం నిల్వలు 426.028 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా డాలర్ మినహా మిగితా యూరో, పౌండ్, రూపాయిల విలువలు పడిపోవడంతో క్రమంగా భారత మారకం విలువలు తగ్గుతున్నాయి. పసిడి నిల్వలు మాత్రం 75.4 మిలియన్ డాలర్లు పెరిగి 21,115 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద భారత నిల్వలు 13 మిలియన్లు తగ్గి 2.476 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.