ముఖేశ్ అంబానీ ‘డబుల్’ దమాకా: రూ.7 లక్షల కోట్లు దాటిన రిలయన్స్

First Published 21, Jul 2018, 8:25 AM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి డబుల్ బొనాంజా లభించింది. వారంలో రెండుసార్లు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7 లక్షల కోట్లు దాటింది. గత జనవరి నుంచి రిలయన్స్ షేర్ 22.5 శాతానికి పైగా పెరిగింది.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7 లక్షల కోట్లు దాటింది. ఇలా స్టాక్స్ గరిష్టస్థాయి రికార్డులు తాకడం వారంలో రెండోసారి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,15,106.70 కోట్ల (104 బిలియన్ డాలర్లు) తాకింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. 

శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ 2.23 శాతం పెరిగి రూ.1,128.55 పెరగ్గా, మొత్తం 3.11 శాతంతో రూ.1,138.25 వద్ద స్థిరపడింది. ఈ నెల 13వ తేదీన పదేళ్లలో తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ల డాలర్ల వద్ద ముగిసింది. గతేడాది నవంబర్ నెలలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్ల మార్కును దాటింది. 

స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,64,164.46 కోట్లకు చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో రిలయన్స్, మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,78,899.21 కోట్లు, హిందూస్థాన్ యూనీలివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,58,506.65 కోట్లతో, ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,34,129.43 కోట్లతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జీవితకాలంలోనే గరిష్ఠస్థాయి రికార్డు నమోదు చేశాయి. గత జనవరి నుంచి 22.5 శాతానికి పైగా రిలయన్స్ షేర్ లబ్ది పొందింది. శుక్రవారం అంతర్గత ట్రేడింగ్ లో 2.5 శాతం లబ్ధి పొందిన సంస్థగా రిలయన్స్ నిలిచింది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం మార్కెట్ విలువలో రెండో స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వినియోగదారుల వ్యాపారాల విస్తరణ కోసం తాజాగా రూ.40 వేల కోట్ల (5.8 బిలియన్ డాలర్ల) విదేశీ రుణాలు పొందేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫండ్స్ సేకరణ, రుణాలు, బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. 

ఈ నెల ప్రారంభంలో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరిట ఫైబర్ టు హోం సర్వీస్, జియో గిగా టీవీ సెటప్ బ్యాక్ ప్రకటించిన తర్వాత రిలయన్స్ షేర్లు దూకుడుగా దూసుకెళ్తున్నాయి. గత 22 నెలల్లో రిలయన్స్ జియో కస్టమర్ల పునాది రెట్టింపైందని ముఖేశ్ అంబానీ స్వయంగా చెప్పారు. 

ఇటీవల ఒక కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977లో ఐపీవోకు వెళ్లినప్పటి నుంచి ప్రతి రెండున్నరేళ్లకు వాటాదారుల నగదు రెట్టింపు అవుతున్నదని, ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు. 

Last Updated 21, Jul 2018, 8:25 AM IST