లాభాల్లో స్టాక్ మార్కెట్లు...భారీగా సెన్సెక్స్ రికవరీ...

By Sandra Ashok KumarFirst Published Mar 13, 2020, 3:37 PM IST
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లు 45 నిమిషాల ట్రేడింగ్ నిలిపివేసిన తర్వాత పున: ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో రికవరీ సాధించాయి. 

ముంబై: కాసేపు నిలిచిన తర్వాత పునఃప్రారంభమైన దేశీయ మార్కెట్లు భారీ లాభాల్ని నమోదుచేస్తున్నాయి. ఒక దశలో 4500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌ అంతర్గత ట్రేడింగ్‌లో గరిష్ట రికవరీని రికార్డు చేసింది. 

శుక్రవారం ఉదయం 29,388 పాయింట్ల వరకు పడిపోయిన బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ తిరిగి 34,434 పాయింట్ల వరకు చేరింది. అటు ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ సైతం మూడు శాతం లాభాల్ని నమోదు చేసింది. 8,555 వద్ద కనిష్ఠ స్థాయికి చేరిన ఎన్‌ఎస్‌ఈ సూచీ 10,068 పాయింట్ల వరకు ఎగబాకింది. 

also read యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

ఫారెక్స్ మార్కెట్లో అటు రూపాయి సైతం బలపడింది. ఓ  సమయంలో డాలర్‌తో మారకం విలువ రూ.74.50 వరకు పడిపోయిన రూపాయి.. ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమైన తర్వాత రూ.రూ.73.91 వరకు కోలుకుంది. ‘ఫియర్‌ గేజ్‌’గా పిలిచే అనిశ్చితఇండెక్స్‌ కాస్త చల్లబడి భయాల్ని తొలగించింది.

అయితే దీన్ని ఏమాత్రం సానుకూల పరిణామంగా పరిగణించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ వొలటాలిటీ ‘ఓవర్‌సోల్డ్‌ జోన్‌’లో ఉన్నట్లు సూచిస్తుందని ఆనంద్‌ రతీ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుజన్‌ హజ్రా అభిప్రాయపడ్డారు. అందుకే కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు. 

also read షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త ! కరోనావైరస్ నెక్స్ట్ టార్గెట్ మీరే...

మధ్యాహ్నం 1.26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,529 పాయింట్లు ఎగబాకి 34,307 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 435 పాయింట్లు లాభపడి 10,025 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.92 వద్ద కొనసాగుతోంది. ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 10శాతానికి పైగా లాభాల్లో నడుస్తున్నాయి. యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే షేర్లు నష్టాలు చవి చూస్తున్నాయి. 

కరోనా భయాలతో ఉదయం రెండు సూచీలు 10శాతానికి పైగా నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ను టచ్‌ కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ నిలిపివేశారు. ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ 966 పాయింట్లు కోల్పోయి లోయర్ సర్క్యూట్ ను తాకింది. సెన్సెక్స్ కూడా 3000 పాయింట్లను తాకడంతో రెండు చోట్ల ట్రేడింగ్ నిలిచిపోయింది. నిఫ్టీ మూడేళ్ల కనిష్టానికి పతనమైంది. 

click me!