సరిలేరు నీకెవ్వరు...రిలయన్స్ అరుదైన ఘనత

By Sandra Ashok Kumar  |  First Published Nov 29, 2019, 10:38 AM IST

రికార్డు సమయంలో మార్కెట్‌ విలువలో సరికొత్త మైలురాయిని చేరిన తొలి భారత కంపెనీగా రిలయన్స్ చేరుకున్నది. గురువారం స్టాక్ మార్కెట్‌లో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లను దాటింది. ఇంట్రాడేలో సంస్థ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయికి చేరుకున్నది. దీనికి జియో, రిటైల్‌ విభాగాల జోరు కారణం.


న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. అంతర్గత ట్రేడింగ్‌లో సంస్థ షేర్ ఆల్‌టైమ్‌ హై.. రూ.1,584ను తాకి చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది.

కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీలోని 250 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాప్‌గా వ్యవహరిస్తారు.  

Latest Videos

అతి తక్కువ కాలంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని సాధించిందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్‌ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు.  

also read  ఓలా, ఉబెర్ డ్రైవరులకు గుడ్ న్యూస్ 

ఈ ఏడాది అక్టోబర్‌కల్లా రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్‌ సెషన్లలోనే మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్‌ 14 శాతం పెరగ్గా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లు ప్రయత్నిస్తుండటం, టెలికం టారిఫ్‌లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్‌ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. వచ్చే నెల నుంచి మొబైల్‌ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్‌ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. కాగా రెండో త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రికార్డ్‌ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీ అనే ట్యాగ్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు, రిలయన్స్‌కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం.  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్‌లో కదలాడింది. రిలయన్స్‌ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్‌ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్‌ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్‌ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్‌ ఘనతకు కారణం.

నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్‌పై విశ్వాసాన్ని కోల్పోలేదు.

రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్‌ కంపెనీ లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరం సాకారం కావచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తాఫా నదీమ్‌ ఆశాభావం వ్యక్తం చేశరు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కోకు వాటా విక్రయం, రిలయన్స్‌ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. 

బ్రోకరేజ్‌ సంస్థలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు కొనొచ్చని పేర్కొన్నాయి. టార్గెట్‌ ధరలను పెంచాయి. వచ్చే దీపావళికల్లా నిఫ్టీ 14,000 మైలురాయికి చేరుకోవచ్చని ఐఐఎఫ్ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. మార్కెట్‌ ప్రగతికి రిలయన్స్‌ షేర్లే ప్రధాన చోదకం కానున్నాయన్నారు.

కాబట్టి, వచ్చే ఏడాది కాలంలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ సంపద మరో రూ.2 లక్షల కోట్ల మేర పెరిగి రూ.12,00,000 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని భాసిన్‌ అంచనా. కంపెనీ కొత్తగా ప్రారంభించిన ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, త్వరలో ప్రారంభించే ఈ-కామర్స్‌ సేవలతో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 20వేల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌లించ్‌(బొఫా-ఎంఎల్‌) అంచనా వేసింది.

also read  ‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌
 
ఇదిలా ఉంటే రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లకు చేరుకున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరింత ధనవంతుడయ్యాడు. దాంతో ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల రియల్‌ టైమ్‌ ర్యాంకింగ్స్‌లో ముకేశ్‌ 9వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాదికి జాబితా ప్రకటించినప్పుడు ఆయనకు 13వ స్థానం లభించింది. అంటే, ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకారు. ప్రస్తుతం ముకేశ్‌ వ్యక్తిగత సంపద 6,080 కోట్ల డాలర్లు. ఈ ఏడాదిలో ముకేశ్‌ సంపద 1,570 కోట్ల డాలర్ల మేర పెరిగింది.
 
మార్కెట్‌ సంపదపరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 62వ స్థానంలో ఉంది. అమెరికన్‌ కరెన్సీలో కంపెనీ మార్కెట్‌ విలువ 14,000 కోట్ల డాలర్లను దాటేసింది. ఆర్‌ఐఎల్‌ షేర్ మరో 5 శాతం పుంజుకుంటే కంపెనీ టాప్‌-50 జాబితాలోకి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 14,500 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో లోరియల్‌ 50వ స్థానంలో ఉంది.

రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ప్రతినిధి అజిత్‌ మిశ్రా స్పందిస్తూ ‘ప్రపంచంలోని ఆరు దిగ్గజ ఇంధన కంపెనీల్లో ఒకటిగా ఆర్‌ఐఎల్‌ ఘనత సాధించింది. ఈ నెలలోనే కంపెనీ.. బ్రిటిష్‌ పెట్రోలియం దిగ్గజం బీపీని వెనక్కి నెట్టి 6వ స్థానానికి చేరుకుంది. టెలికాం, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడులు ఆర్‌ఐఎల్‌కు మంచి ప్రతిఫలాలు అందించాయి. అంతేకాదు, మొత్తం లాభాల్లో ఈ రెండు వ్యాపారాల వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దాంతో కంపెనీ షేరు ధర గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పుంజుకుంది’ అని తెలిపారు.


రిలయన్స్ ఎస్‌ అండ్‌ పీ, మూడీస్‌ వంటి అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల నుంచి రేటింగ్‌ పొందిన తొలి భారత ప్రైవేట్‌ కంపెనీ. దేశంలో రూ.10,000 కోట్లకు పైగా త్రైమాసిక లాభం ప్రకటించిన తొలి కంపెనీ. రూ.లక్షల కోట్ల మార్కెట్‌ విలువ సాధించిన తొలి భారత సంస్థ.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1977లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. గడిచిన 42 ఏళ్లలో కంపెనీ మార్కెట్‌ సంపద రూ.10 కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. అంటే, 1977లో ఈ కంపెనీలో రూ.10,000 పెట్టుబడిగా పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ రూ.2.1 కోట్లకు చేరి ఉండేది. 
 

click me!