‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌

By Sandra Ashok Kumar  |  First Published Nov 28, 2019, 11:16 AM IST

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తాము మునుపెన్నడూ అనుమతించని లావాదేవీలు జరిపిందని సెబీ చైర్మన్ అజిత్ త్యాగి తెలిపారు. మదుపర్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.. వినియోగదారుల షేర్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలను సెబీ నిలిపివేసింది. 


ముంబై: తాము ఎన్నడు అనుమతించని పనులను కార్వీ చేసిందని సెబీ ఛైర్మన్‌ అజిత్‌ త్యాగి వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లలో కార్వీ ట్రేడింగ్‌ను నిషేధించాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మునుపెన్నడూ అనుమతించని కార్యకలాపాలకు పాల్పడిందన్నారు. వినియోగదారుల షేర్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలను సెబీ నిలిపివేసింది. 

బుధవారం కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)-ఏషియన్ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి హాజరైన ఆయన కార్వీ ట్రేడింగ్ పై విధించిన నిషేధం విషయమై మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందెప్పుడూ అనుమతించనివి జరిగాయన్నారు. సెబీ ఇటువంటి అంశాలపై తన వైఖరిని జూన్‌లోనే స్పష్టం చేసింది. మేం ఏ పరిస్థితుల్లోను వినియోగదారుల సెక్యూరిటీలను వారికి తోచినట్లు చేయమని ఏ సందర్భంలోనూ చెప్పలేదని, అసలు ఏ రకంగానూ అంగీకరించని విషయం ఇదని సెబీ వివరించింది.

Latest Videos

undefined

also read అమ్మో కార్వీ!! సంక్షోభం నుంచి కోలుకుంటుందా?!!

కార్వీ గ్రూపింగ్ లావాదేవీలపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఇటీవల తనిఖీలు చేపట్టింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్ ‌(కేఎస్బీఎల్‌) సంస్థ రూ.1096 కోట్లను తన గ్రూప్‌ కంపెనీ కార్వీ రియాల్టీ సంస్థకు 2016 ఏప్రిల్‌ నుంచి 2019 అక్టోబర్ మధ్య బదిలీ చేసిందని ఆ తనిఖీలో తేలింది. ఇంకా క్లయింట్ల ఖాతాల్లో పలు అవకతవకలకు జరిగినట్లు తేలింది.

తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీల (డీపీ ఖాతాలో లేని)ను ‘కార్వీ’ విక్రయించింది. అంతే కాక 2019 మే వరకు ఈ తొమ్మిది మంది క్లయింట్లలో ఆరు మందికి చెందిన రూ.162 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను బదిలీ చేసింది.

నలుగురు క్లయింట్లకు చెందిన రూ.257.08 కోట్ల విలువైన సెక్యూరిటీలను ‘కార్వీ’ తనఖా పెట్టింది. ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మధ్య ఆ షేర్లను తనఖా నుంచి విడిపించుకున్నా, అందులో రూ.217.85 కోట్ల విలువైన షేర్లను కేఎస్‌బీఎల్‌ రికవరీ చేసుకుంది.2019లో ఆ తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన ఖాతాల్లో అయిదు మంది నుంచి రూ.228.07 కోట్ల విలువైన షేర్లను కేఎస్‌బీఎల్‌ కొనుగోలు చేసింది. 156 క్లయింట్లు ఒక్క ట్రేడ్‌ కూడా నిర్వహించకున్నా, వారి నుంచి రూ.27.8 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. 

జూన్‌ 2019 నుంచీ కేఎస్‌బీఎల్‌తో ఎటువంటి ట్రేడింగ్‌ నిర్వహించకున్నా 291 క్లయింట్ల నుంచి రూ.116.3 కోట్ల షేర్లను ఆ సంస్థ ట్రాన్స్ ఫర్ చేసింది. క్లయింట్స్ సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై గత శుక్రవారం స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల నుంచి హైదరాబాద్‌కు చెందిన స్టాక్ బ్రోకరేజీ సంస్థ కార్వీని సెబీ నిషేధించిన విషయం తెలిసిందే. కొత్త క్లయింట్లను తీసుకోరాదని ఆదేశించిన సంగతి విదితమే.  కాగా, కార్వీ తమ క్లయింట్లు ఇచ్చిన అధికారాల ద్వారా చేసే ఎటువంటి సూచనలనూ పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌లను కూడా సెబీ ఆదేశించింది.

also read  పీఎస్‌ఎల్‌వీ C-47కి మొదలైన కౌంట్‌డౌన్‌: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కే. శివన్

క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.600 కోట్ల నిధులను కార్వీ సమీకరించిందని తెలుస్తున్నది. ఈ సెక్యూరిటీలను మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద కార్వీ తాకట్టు పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్).. దాదాపు 95 వేల క్లయింట్ల సెక్యూరిటీలను తాకట్టు పెట్టిందని ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనం. 

దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన కార్వీపై మదుపరులు.. స్టాక్స్, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై సెబీ దర్యాప్తు చేపడుతుండగా, ఎన్‌ఎస్‌ఈ కూడా ఈవై సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నది. మరిన్ని క్లయింట్ల సెక్యూరిటీలు దుర్వినియోగం కాకుండా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సెబీ శాశ్వత సభ్యుడు అనంత బరువా అన్నారు.

click me!