కిరాణాలోకి రిలయన్స్‌ ‘స్మార్ట్ పాయింట్లు’!

By Arun Kumar PFirst Published Jan 22, 2020, 4:24 PM IST
Highlights

ఒక్కో రంగంలో అడుగు పెడుతూ ఒక్కో అడుగు ముందుకేస్తూ పైమెట్టు ఎక్కుతున్న రిలయన్స్ తాజాగా 'స్మార్ట్‌ పాయింట్ల' పేరిట విస్తృతంగా దుకాణాల ఏర్పాటు చేయ తలపెట్టింది. మారుమూల ప్రాంతాలకూ విస్తరణ యోచనలో ఉంది. రిటైల్‌ దిగ్గజాలకు చెక్‌చెప్పేలా భారీ ప్లాన్‌ రూపొందించింది. ఇది చిన్న వ్యాపారులకు పెద్దదెబ్బేనని తెలిపారు. 
 

న్యూఢిల్లీ: పెట్రో కెమికల్స్.. టెలికం.. ఫైబర్.. డిజిటల్.. ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్న రిలయన్స్ తాజాగా దేశంలో రిటైల్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరించే యోచనలో ఉన్న దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఇందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే చమురు రంగం, టెలికాం రంగాలలో అడుగుపెట్టిన ఈ సంస్థ ఆయా రంగాలలో పోటీ సంస్థలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. 

ఇదే క్రమంలో తాజాగా రిలయన్స్‌ సంస్థ రిటైల్‌ రంగంలోనూ విధ్వంసకరంగా విస్తరించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజా ప్రణాళికలో భాగంగా రిలయన్స్‌ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలను తెరువనుంది. దాదాపు 500 చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

'రిలయన్స్‌ స్మార్ట్‌పాయింట్‌' పేరిట సంస్థ వీటిని ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. తొలుత వీటిని రిలయన్స్‌ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాలలో ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత రిలయన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులను ఉటంకిస్తూ పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది. 

రానున్న కాలంలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ల పేరిట ఈ దుకాణాలు మండలాలు, ప్రధాన గ్రామాల స్థాయికి విస్తరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో నిర్ణయించిన మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాల వారితో జట్టుకట్టి స్మార్ట్‌స్టోర్స్‌ను ఏర్పాటు చేయడం, మెరుగ్గా లాభసాటిగా ఉంటూ ఎక్కువ వ్యాపార కార్యకలాపాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో స్వయంగా కిరాణా దుకాణాలను ఏర్పాటు చేయాలన్నది రిలయన్స్‌ విస్తరణ వ్యూహంగా తెలుస్తోంది.

రిలయన్స్‌ సంస్థ 'రిలయన్స్‌ స్మార్ట్‌పాయింట్‌' పేరిట దేశ వ్యాప్తంగా కిరాణా దుకాణాలను తెరువాలన్న ఆలోచన వెనుక పలు వ్యాపార వ్యూహాలు దాగి ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కిరాణా దుకాణాలలో ప్రజలు సూపర్‌ మార్కెట్ల మాదిరే వెళ్లి తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు.

దీనికి తోడు రిలయన్స్‌ రిటైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొనే పచారీ సరుకులను కూడా ఇక్కడి నుంచి డెలివరీ తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాక అమెజాన్‌ వంటి అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజ సంస్థలు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు కూడా తన విస్తృతిని పెంచుకోవాలన్నది రిలయన్స్‌ వ్యూహంగా కనిపిస్తోంది. 

దీంతో తన రిటైల్‌ వ్యాపారాన్ని దేశ వ్యాప్తంగా ఏకకాలంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ ద్వారా భారీగా విస్తరించేందుకు వీలు పడుతుందన్నది రిలయన్స్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తూ వస్తున్న కిరాణా దుకాణాల, చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి భవిత రిలయన్స్‌ 'రిలయన్స్‌ స్మార్ట్‌పాయింట్‌' నిర్ణయంతో ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రిలయన్స్‌ మారుమూల ప్రాంతాల్లో కూడా తన స్టోర్లు ఏర్పాటు చేయడం తక్కువ ధరలకు వస్తువులను అందించడంతోపాటు డిజిటల్‌ షాపింగ్‌ సౌకర్యం కూడా కల్పించనుండడంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వారి భవితకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. 

రిలయన్స్‌ స్టోర్స్‌ వల్ల చిన్నచిన్న కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, ఎలక్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌ దుకాణాల వారి వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే భవిష్యత్‌లో కొన్ని వేల కుటుంబాల వారు వీధిన పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. జియో రాకతో టెలికాం రంగంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో.. స్మార్ట్‌ పాయింట్ల రాకతో రిటైల్‌ కిరాణా రంగంలోనూ అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

click me!