చిక్కుల్లో ఆర్థిక వ్యవస్థ.. ‘నిర్మల’మ్మకు బడ్జెట్ అగ్ని పరీక్ష

By narsimha lodeFirst Published Jan 22, 2020, 2:51 PM IST
Highlights

భారతదేశం ప్రస్తుతం అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నది. 2020-21 సంవత్సర బడ్జెట్ సమస్యల్లో చిక్కుకుంది.

న్యూఢిల్లీ: భారతదేశం ప్రస్తుతం అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నది. 2020-21 సంవత్సర బడ్జెట్ సమస్యల్లో చిక్కుకుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కోలుకొనే లోపే ఫలితం తలకిందులయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. ఓ రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకున్నదనే చెప్పాలి. ఒకదానికి మరొకటి కారణం అవుతూ వృద్ధి రేట్‌ను వెనక్కు లాగుతున్నాయి. 

ప్రస్తుతం జీడీపీ వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఐదు శాతానికి రావడం ప్రధాన సమస్యగా మారింది. దేశీయంగా డిమాండ్‌ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. డిమాండ్‌ తగ్గడంతో ఉత్పాదక రంగం కుంటుపడింది.. ఫలితంగా పన్ను వసూళ్లు పడిపోయాయి.

దీంతో ద్రవ్యలోటు పెరిగిపోయి ప్రభుత్వ వ్యయం తగ్గింది. వీటి ప్రభావంతో ఉద్యోగాలు తగ్గిపోయి నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు పెరగడంతో ప్రజల చేతిలో డబ్బు లేక డిమాండ్‌ పడిపోయింది. ఇలా ఒక్కో అంశానికి మరో అంశం కారణమవుతూ ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుతున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం వీటిల్లో  కొన్నింటిని పరిష్కరించినా.. మిగిలిన సమస్యలకు కొంత ఉపశమనం లభించి ఆర్థిక వ్యవస్థ పుంజుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మఖ్యంగా దేశీయంగా డిమాండ్‌ పెరిగితే చాలా వరకు సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ సారి బడ్జెట్‌ కూడా ప్రభుత్వం డిమాండ్‌ను పెంచేలా చర్యలు తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా కొన్ని అంశాలను ఇందు కోసం ప్రభుత్వం వినియోగించుకోనే అవకాశాలు ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వం ఈ సారి వ్యయాన్ని పెంచేందుకు ద్రవ్యలోటు కట్టడి విషయంలో మరికొంత పట్టువిడుపు ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంది. గతానికంటే ఎక్కువ ద్రవ్యలోటును చూపి వ్యయాన్ని పెంచే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యయాన్నీ ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టులపై పెట్టే అవకాశం ఉంది. 

దీంతో ఉద్యోగాలు రావడంతోపాటు ఈ ప్రాజెక్టుల రూపంలో భవిష్యత్‌లో ప్రభుత్వానికి మరిన్ని ఆదాయ వనరులు సమకూరుతాయి. వీటిల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చిన్నస్థాయి ప్రాజెక్టులు అయ్యే అవకాశం ఉంది.

ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీఎస్‌టీలో ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత సరళంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. పన్ను విధానాల్లో సంక్లిష్టతలు తొలగిపోయే కొద్దీ పన్ను వసూళ్లు పెరుగుతుంటాయి. ఇది ప్రభుత్వాదాయాన్ని స్థిరంగా ఉంచి.. ద్రవ్యలోటును నిర్ణీత లక్ష్యంలో ఉంచేలా చేస్తుంది. 

ఆర్థిక వ్యవస్థలోకి నగదును ప్రవహింపజేసి డిమాండ్‌ను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కానున్నది. కాకపోతే ఇందుకోసం ప్రభుత్వం వద్ద రాబడి ఉండాలి. గత ఏడాది మొత్తంగా చూస్తే పన్ను వసూళ్లు తగ్గడంతో ప్రభుత్వ రాబడి తగ్గింది. 

ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యం పెంచుకుని నగదు  వినియోగించుకొనే అవకాశాలను ప్రభుత్వం మెరుగు పర్చుకోవచ్చు. ఇప్పటికే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం.. పన్ను మినహాయింపులు పెంచడం.. వంటి వాటితో ప్రజల వద్ద నగదు నిల్వలను పెంచవచ్చు.

2020లో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసి ప్రభుత్వం నిధులను సమకూర్చుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి ద్రవ్యలోటు పెరగడానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం తప్పడం కూడా ఒక ప్రధాన  కారణంగా నిలిచింది. ఇప్పటికే 2019-20లో లక్ష్యాన్ని చేరేందుకు మార్చి31వరకు గడువు ఉంది. ఈ లోపు ముందుగా నిర్ణయించిన సంస్థల్లో వాటాలను విక్రయించుకొంటే ప్రభుత్వం చేతికి నగదు అందుతుంది.  

అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసి ఉద్యోగాలను పెంచవచ్చు. వ్యవసాయం, రియల్‌ఎస్టేట్‌, హౌసింగ్‌, రహదారుల నిర్మాణం, నీటిపారుదల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి డిమాండ్‌ను పెంచవచ్చు.

అదే సమయంలో కేవలం డిమాండ్‌ తగ్గడం వల్లే రుణాలు చెల్లించలేని సంస్థల అప్పులను రోలోవర్‌ (చెల్లింపు గడువు పెంచి) చేసి ఆ సంస్థలను నిలబెట్టడం ద్వారా ఉద్యోగాలు పోకుండా చూడవచ్చు. లేకపోతే చాలా కంపెనీలు సంక్షోభంలో కూరుకుని భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయి. 

2008లో ఆర్థిక మాంద్యం సమయంలోనూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేసింది. దీంతోపాటు దేశంలో సులభతర వాణిజ్యాన్ని ఆకర్షణీయంగా మార్చే సాహసోపేతమైన సంస్కరణలను వేగంగా పట్టాలపైకి ఎక్కించి పెట్టబడులను ఆకర్షించాలి. ఫలితంగా దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి.  

జీడీపీ వృద్ధిరేటు 11ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు నగదును సమకూర్చే నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి.  ఇవి  తీవ్రమైన నగదు కొరత ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత డిమాండ్‌ను పెంచలేకపోయింది. గత ఏడాది ఐదుసార్లు వడ్డీరేట్లు తగ్గించినా డిమాండ్‌ పుంజుకోలేదు. 

బలంగా దివాళా చట్టం అమలుతో బ్యాంకులకు నగదు లభ్యత పెరిగింది. ఫలితంగా మరింత అప్పులు ఇచ్చేందుకు అవకాశం లభించింది. 2019 చివరి రెండు నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు పెరగడం భవిష్యత్‌పై ఆశలు రేపుతున్నాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమలో టెక్నాలజీ మారుతుండటంతో బీఎస్‌-6 అమల్లోకి వచ్చాక కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగాలు కూడా పెరగవచ్చు.

click me!