కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు

By rajesh yFirst Published Apr 15, 2019, 10:54 AM IST
Highlights

రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.

న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాత్మక మార్పులు తెచ్చిన రిలయన్స్‌ జియో ఇప్పడు మరో సరికొత్త రికార్డును సృష్టించింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్ల మార్కు దాటింది. గత నెల రెండో తేదీనే రిలయన్స్ జియో ఈ రికార్డును సాధించింది. 

2016లో  కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది యూజర్లను పొందిన సంస్థగా జియో రికార్డు నెలకొల్పింది. అంతకుముందు టెలికం సేవలను ప్రారంభించిన జియో కేవలం 175 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అఫిషియల్ పార్టనర్‌గా జియో ఉంది. అయితే జియో ‘300 మిలియన్ల యూజర్లతో సంబురాలు చేసుకుంటున్నది’ అని టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో అసలు సంగతి బయటపడింది. 

ప్రస్తుతం టెలికం కంపెనీయైన భారతీ ఎయిర్‌టెల్‌కు 34 కోట్ల మంది వినియోగ దారులు ఉన్నారు. భారతీ ఎయిర్ టెల్ తన 19వ ఏట 30 కోట్ల మంది వినియోగదారులను చేర్చుకున్న రికార్డు సాధించింది. గతేడాది విలీనం కావడంతో 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్‌ - ఐడియా అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది.

click me!