ఈ- కామర్స్‌లోకి రిలయన్స్ : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు ఛాలెంజ్

By Siva KodatiFirst Published Mar 9, 2019, 10:41 AM IST
Highlights

జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే షేక్ చేసిన ముకేశ్ అంబానీ.. ‘ఈ-కామర్స్’ రిటైల్ రంగంలో అడుగు పెట్టడం ద్వారా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు సవాల్ విసరనున్నారు. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ-కామర్స్‌ విస్తరణ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. అందుకోసం‘రిలయన్స్‌ ట్రెండ్స్‌’ను భారీగా విస్తరించడానికి రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ రిటైల్ ఔట్‌లెట్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచాలని, వాటిని ఈ - కామర్స్‌తోనూ అనుసంధానించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది. 

తద్వారా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సవాలు విసిరేలా ఎదగాలని భావిస్తోందని రిలయన్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తద్వారా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీపడుతున్న ఈ రంగంలో మెరుగైన మార్కెట్‌ వాటా దిశగా అడుగులు వేస్తోంది.

కొత్త ఈ కామర్స్‌ విధానం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలకు ప్రతికూలంగా ఉండటంతో... ఈ కామర్స్‌ విభాగంలో ఫ్యాషన్‌ పరంగా విస్తరించేందుకు ఇది అనుకూల సమయమని రిలయన్స్‌ భావిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. 

ఈ–కామర్స్‌ సంస్థలు తమకు వాటాలు గల కంపెనీల నుంచి విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. తమ ద్వారానే విక్రయించేలా వెండర్లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడాన్ని నిషేధించింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌ ఈ కామర్స్‌ విభాగంలో భారీగా చొచ్చుకుపోయేందుకు ఇదే అనుకూల తరుణమని భావిస్తోంది. 

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ రిటైల్‌ను 2007లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ రిటైల్‌ విస్తరణకోసం రూపొందించిన  పలు ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయని ఇటీవల రిటైల్‌ సలహాదార్లతో జరిగిన సమావేశంలో తెలిసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై రిలయన్స్‌ రిటైల్‌ స్పందించలేదు.

ఈ విస్తరణ ప్రణాళికలతో ప్రస్తుతం దుస్తులు, యాక్సెసరీలు విక్రయిస్తున్న రిలయన్స్‌ ట్రెండ్స్‌ తన ప్రైవేట్ లేబుల్స్‌‌ను వేగంగా వృద్ధి చేసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 160 నగరాల్లో విస్తరించి ఉన్న రిలయన్స్‌ ట్రెండ్స్‌ వచ్చే అయిదేళ్లలో 300 నగరాలకు చేరుతుందని మరో వ్యక్తి తెలిపారు. 

తమ ఈ-కామర్స్‌ సంస్థతో ప్రైవేట్ లేబుళ్లను అనుసంధానం చేసి చిన్న, మూడో శ్రేణి, నాలుగో శ్రేణి పట్టణాలకు వ్యాపించడం రిలయన్స్‌ ట్రెండ్స్‌ ప్రణాళిక అని ఒక రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చెబుతున్నారు. కాగా, స్టోర్ల విస్తరణ ప్రణాళికపై ఆయన ధ్రువీకరించలేదు. గతేడాది రిలయన్స్‌ ట్రెండ్స్‌ 100కు పైగా స్టోర్లను తెరచినట్లు తెలిపారు. 

కొత్త ఈ-కామర్స్‌ సంస్థ ద్వారా మా ప్రైవేట్ లేబుళ్లను విక్రయించడం మరింత సులువవుతుంది. థర్డ్‌పార్టీ స్టోర్ల ద్వారానూ వీటిని అమ్ముతామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు కోరారు. చిన్న, మధ్య స్థాయి వర్తకులను రిటైల్‌ నెట్‌వర్క్‌, గిడ్డంగులకు అనుసంధానించడం ద్వారా ప్రైవేటు లేబుళ్ల విక్రయాలను పెంచుకోవాలన్నది కొత్త ఈ-కామర్స్‌ సంస్థ లక్ష్యంగా ఉంది.

ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో ఈ-కామర్స్‌ రిటైలర్ల పంట పండింది. నిత్యావసర వస్తువులు మొదలు.. భారీ ఎలక్ట్రానిక్‌ వస్తువల వరకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదొక గొప్ప అవకాశం. రిలయన్స్‌ కూడా అందుకే ఈ రంగంలోకి అడుగుపెడుతోందని పరిశ్రమ విశ్లేషకుడొకరు పేర్కొన్నారు. 

తమ థర్డ్‌ పార్టీ బ్రాండ్లతో పోలిస్తే సొంత బ్రాండ్ల విక్రయం ద్వారా రిటైలర్లు ఎక్కువ మార్జిన్లను పొందుతున్నారు. రిలయన్స్‌ ట్రెండ్స్‌ కూడా ప్రైవేట్ లేబుళ్లను బహుళ బ్రాండ్‌ ఔట్‌లెట్లతో పాటు చిన్న స్టోర్లలోనూ లభ్యమయ్యేలా విస్తరణ ప్రణాళికలను రచించుకుంటోందని ఒక స్వతంత్ర రిటైల్‌ కన్సల్టెంట్ పేర్కొన్నారు.

ఎందుకంటే రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఆదాయంలో 80 శాతం ప్రైవేట్ లేబుళ్లద్వారానే వస్తోంది. అంతర్జాతీయ ఫ్యాషన్‌ను భారత ధరలకు అనువుగా ప్రైవేట్ లేబుళ్ల ద్వారా అది అందిస్తూ ఈ రంగంలో పాగా వేయాలని భావిస్తోంది.

మన దేశంలో 18–35 ఏళ్ల వయసు గ్రూపు వారు 44 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో యువ జనాభా మన దగ్గరే ఎక్కువ. యువతరాన్ని ఆకర్షించడానికే ప్రతి రిటైలర్‌ చూస్తారని, రిలయన్స్‌ కూడా ఇందుకు భిన్నమేమీ కాదని రిటైల్‌ రంగ ప్రముఖుడొకరు పేర్కొన్నారు. 

రిలయన్స్‌ రిటైల్‌ వేగవంతమైన విస్తరణ ప్రణాళిక ప్రైవేట్ లేబుల్‌ ఉత్పత్తులు మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్లు, చిన్న ఫార్మాట్‌ దుకాణాల్లోనూ లభించేలా ఉంటుందని రిటైల్‌ కన్సల్టెంట్‌ గోవింద్‌ శ్రీఖండే తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాలు, లండన్‌లోని మరో కేంద్రంలోని డిజైనర్ల బృందాలు జీన్స్, ట్రోజర్స్, షర్ట్‌లు, టీ షర్ట్‌లను డిజైన్‌ చేస్తుంటారని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.    

click me!