ఫస్ట్ టైం: ఫార్చ్యూన్‌లో రిలయన్స్ టాప్.. తర్వాతే ఐఓసీ.. బట్

By rajesh yFirst Published Jul 24, 2019, 11:23 AM IST
Highlights
  • ఫార్చ్యూన్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారతదేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను దాటేసి రిలయన్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 
  • అంతర్జాతీయంగా అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ నిలిచింది.

న్యూఢిల్లీ: మదుపరికి లాభాలు గడించి పెట్టే సంస్థగా, అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలతో దూసుకెళుతున్న రిలయన్స్ మరో ఘనతను సాధించింది. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ -500 కంపెనీల్లో, దేశీయంగా అగ్రస్థానాన్ని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దక్కించుకుంది. 

గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలో రిలయన్స్‌ 42 స్థానాలు పైకి దూసుకొచ్చి 106వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు 117వ స్థానం మాత్రమే లభించింది. తద్వారా దేశీయంగా ఐఓసీ రెండో స్థానానికి పరిమితమైంది. 

2018లో 62.3 బిలియన్ డాలర్లుగా ఉన్న రిలయన్స్ ఆదాయం ప్రస్తుత సంవత్సరానికి 32.1 శాతం ఎగబాకి 82.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇదే సమయంలో ఐవోసీ ఆదాయం 65.9 బిలియన్ డాలర్ల నుంచి 77.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయ వృద్ధిలో 17.7 శాతం కనబరిచింది. 

గత పదేళ్లుగా రిలయన్స్ సరాసరి 7.2 శాతం వృద్ధిని సాధించగా, ఇదే సమయంలో ఐవోసీ 3.64 శాతంతో సరిపెట్టుకున్నది. 2010లో రిలయన్స్ ఆదాయం 41.1 బిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం ఇది రెండింతలు పెరిగింది. ఐవోసీ ఆదాయం 54.3 బిలియన్ డాలర్ల నుంచి 50 శాతం వృద్ధిని సాధించింది. 

2010 నుంచి రూపొందిస్తున్న ఈ జాబితాలో ఇప్పటివరకు దేశీయంగా అగ్రస్థానంలో నిలిచిన ఐఓసీ ఈసారి ఆర్‌ఐఎల్‌ కంటే వెనుకబడిందని ఫార్చ్యూన్‌ తెలిపింది. ఈ జాబితాలో దేశీయ సంస్థలైన ఓఎన్‌జీసీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), టాటా మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌కూ చోటు దక్కింది.

అంతర్జాతీయ జాబితాలో ఓఎన్‌జీసీ 37 స్థానాలు ఎగబాకి 160వ స్థానానికి చేరుకోగా, ఎస్బీఐ 20వ స్థానాలు పడిపోయి 236కి జారుకున్నది. టాటా మోటర్స్ 33వ స్థానాలు పడిపోయి 265వ స్థానానికి, బీపీసీఎల్ 39 ప్లేస్‌లు ఎగబాకి 275వ స్థానానికి చేరుకున్నది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 90వ స్థానాలు పడిపోయి 495వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ 500 జాబితాల్లో గడిచిన 16 ఏళ్లుగా స్థానం దక్కించుకున్న ఆర్‌ఐఎల్ ఈసారి తొలిస్థానం దక్కించుకోవడం విశేషం. 

మళ్లీ ఫార్చ్యూన్‌ 500 జాబితాలో అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌దే  ప్రథమస్థానం కాగా, చైనా ప్రభుత్వరంగ చమురు-సహజవాయువు కంపెనీ సినోపెక్‌ గ్రూప్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక డచ్‌ కంపెనీ రాయల్‌ డచ్‌ షెల్‌ మూడో స్థానంలో, చైనా నేషనల్‌ పెట్రోలియం నాలుగో ర్యాంక్,. స్టేట్‌గ్రిడ్‌ అయిదో స్థానంలో నిలిచాయి. సౌదీచమురు సంస్థ సౌదీ ఆరామ్‌కో (6), బీపీ (7), ఎగ్జాన్‌ మొబిల్‌ (8), వోక్స్‌వ్యాగన్‌ (9), టయోటా మోటార్‌ 10వ స్థానాల్లో నిలిచాయి. సౌదీ ఆరామ్ కో సంస్థ తొలిసారి చోటు దక్కించుకున్నది. 

click me!