20న రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ.. 700 కోట్ల డాలర్ల పెట్టుబడి సాధనే లక్ష్యం

By narsimha lodeFirst Published May 17, 2020, 1:32 PM IST
Highlights

చమురు నుంచి టెలికం వరకు పలు వ్యాపారాలు నిర్వహ్తిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రైట్స్‌ ఇష్యూ తేదీలను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల మూడవ తేదీన ముగియనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: చమురు నుంచి టెలికం వరకు పలు వ్యాపారాలు నిర్వహ్తిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రైట్స్‌ ఇష్యూ తేదీలను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల మూడవ తేదీన ముగియనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ  ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంకల్పించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు డైరెక్టర్లు రైట్స్‌ ఇష్యూ తేదీలకు ఆమోదముద్ర వేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. షేర్ ధరను రూ.1,257గా నిర్ణయించింది. ప్రతి పదిహేను షేర్లను కొనుగోలు చేసినవారికి ఒక షేరును ఆఫర్‌ చేయనున్నది.

దీంతో గత నెల 30న ముగిసిన రిలయన్స్ షేర్ ధరతో పోలిస్తే 14 శాతం రాయితీ ఇచ్చినట్లయింది.  వచ్చే ఏడాది చివరినాటి వరకు రుణాలు లేని సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటనకు అనుగుణంగా రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు సిద్ధమైంది. 

ఈ రైట్స్‌ ఇష్యూలో అంబానీ కుటుంబ సభ్యులు కూడా షేర్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 1991లో రైట్స్‌ ఇష్యూకి వచ్చిన ఆర్‌ఐఎల్‌.. మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఇష్యూకి రాబోతుండటంతో స్టాక్‌ మార్కెట్లో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇందుకోసం తొమ్మిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను రిలయన్స్ సిద్ధం చేసుకున్నది.

అలాగే గత నెలరోజుల్లో విదేశీ టెక్నాలజీ సంస్థలు జియోలో వరుసగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. రిలయన్స్ జియోలో న్యూయార్క్‌కు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్  రెండు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు దాదాపు రూ. 10 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. 

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.3 శాతం వాటాలను దక్కించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ గా పేరొందిన విస్టా సుమారు రూ.11,367 కోట్ల విలువైన వాటాలను దక్కించుకోనుంది. 

జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ గత నెలలో తెలిపింది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు పోటీగా ఫేస్ బుక్ అనుబంధ వాట్సాప్ తో కలిసి జియో మార్ట్ పేరిట రిలయన్స్ ఈ-కామర్స్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
 

click me!