Reliance Buying: ముఖేష్ అంబానీ చేతికి అమెరికన్ కాస్మొటిక్స్..!

By team teluguFirst Published Jun 17, 2022, 4:56 PM IST
Highlights

అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ దివాళా తీసింది. 

అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ దివాళా తీసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రెగ్యులేటరీకి సమర్పించింది. దివాళా తీయడానికి గల కారణాలను ఇందులో వివరించింది.

1932లో ఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. మెక్ఆండ్రూస్ అండ్ ఫోర్బ్స్ దీన్ని స్థాపించాయి. అమెరికన్ బిలియనీర్ రాన్ పెరెల్‌మ్యాన్‌ దీని అధిపతి. మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్‌ఫ్యూమ్స్ విక్రయిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తడిసిమోపెడు కావడం, కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రం కావడం, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకోలేకపోవడం వంటి కారణాలు.. దివాళా తీయడానికి ప్రధాన కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. దివాళా తీసినట్లు సమాచారం అందిన వెంటనే రెవ్లాన్ కంపెనీ షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. 

న్యూయార్క్ స్టాక్ఎక్స్ఛేంజ్‌లో కొన్ని గంటల్లో రెవ్లాన్‌ సంపద ఆవిరైపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లో రెవ్లాన్ షేర్ల ట్రేడింగ్‌ 53 శాతం మేర పతనం అయ్యాయి. 250 డాలర్లతో నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయిన రెవ్లాన్ ఒక్కో షేర్ ధర..ప్రస్తుతం 1.95 డాలర్లకు పడిపోయిందంటే.. వాటి దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చ్ 31వ తేదీ నాటికి రెవ్లాన్ కంపెనీ రుణాలు 3.31 బిలియన్ డాలర్లు. 

కాగా- రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను టేకోవర్ చేయడానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. దివాళా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే- ఈ కాస్మొటిక్స్ బిగ్ షాట్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వశం కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. దీనికి అవసరమైన బిడ్డింగ్స్‌ను దాఖలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుడే సంప్రదింపులు సైతం మొదలు పెట్టినట్లు సమాచారం. దీన్ని టేకోవర్ చేయడం ద్వారా కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లోనూ రిలయన్స్ యాజమాన్యం అడుగు పెట్టినట్టవుతుంది. రిలయన్స్ మార్కెట్‌కు రెవ్లాన్ మరింత గ్లామర్‌ను తీసుకొస్తుందనే కామెంట్స్ మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోన్నాయి.
 

click me!