RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. వరుసగా తొమ్మిదో సారి

By Sumanth KanukulaFirst Published Dec 8, 2021, 11:28 AM IST
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య విధాన కమిటీ.. కీలక వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇలా యథాతదంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదో సారి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య విధాన కమిటీ.. కీలక వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగానే ఉంచింది. అయితే కోవిడ్ కొత్త వేరియంట్, అధిక ద్రవ్యల్బోణం భయాల నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడలేదు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గ‌వ‌ర్నర్ శ‌క్తికాంత్ దాస్ (Shaktikanta Das) బుధవారం వెల్లడించారు. రెపో రేటును ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగించనున్నట్టుగా తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 4.25 శాతం వద్ద కొనసాగించినట్టుగా చెప్పారు. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారిగా ఆర్‌బీఐ  2020 మే నెలలో రెపోరేటును 4 శాతానికి కుదించింది. అప్పటి నుంచి దానిని అలాగే కొనసాగిస్తుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇలా యథాతదంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదో సారి.

ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee )  వడ్డీ రేట్‌లను యథాతదంగా కొనసాగించేందుకు ఆమోదం తెలిపిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండేలా చూసుకుంటూ వృద్ధిని పెంచేందుకు అవసరమైనంత కాలం.. రేట్లను స్థిరంగా కొనసాగించేందుకు, అనుకూలమైన వైఖరిని కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు అంచనాను 9.5 శాతంగా కొనసాగించినట్టుగా శక్తికాంత్ దాస్ చెప్పారు. 

అయితే అంతకుముందు ఆర్బీఐ మూడో త్రైమాసికం (క్యూ 3) వృద్ధి అంచనాను  6.8 శాతం నుండి 6.6 శాతానికి సవరించింది. ఇక, రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా అంచనా వేయబడిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, అయితే సమీప కాలంలో ధరల ఒత్తిళ్లు కొనసాగవచ్చని చెప్పారు.

వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్వారా కొలవబడే భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.48 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 2021లో CPI ఆధారిత ద్రవ్యోల్బణం 4.35 శాతం ఉంది. అయితే ఇదే 2021 అక్టోబర్లో 7.61 శాతంగా ఉంది.

ఇక, రెపో రేటు అనేది RBI వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు కాగా,  రివర్స్ రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్.. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రేటు అనే సంగతి తెలిసిందే. 

click me!