మోడీ కొత్త పథకం.. 59 నిమిషాల్లో లోన్‌: ఎగబడుతున్న జనం

By Siva KodatiFirst Published Mar 4, 2019, 11:36 AM IST
Highlights

పారదర్శకత పెంపుదలతోపాటు సరైన పత్రాలు ఉంటే సకాలంలో రుణం మంజూరు చేసేందుకు పలు వేదికలు ముందుకు వస్తున్నాయి. గత నవంబర్ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ డాట్ కాం’ ఇప్పటివరకు రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసింది. 

చిన్న, మధ్యస్థాయి తరహా సంస్థలకు గంటలోపే రుణం మంజూరు చేసేందుకు నెలకొల్పిన వెబ్‌సైట్‌ విజయవంతమైందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌ నివేదిక పేర్కొన్నది.

మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వెబ్‌ పోర్టల్‌ ‘పీఎస్బీ లోన్స్‌ఇన్‌59 మినిట్స్‌.కామ్‌’ ద్వారా ఇప్పటివరకు రూ.35వేల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

దేశంలోనే అత్యధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసిన ఆన్‌లైన్‌ రుణ వేదికగా దీనికి గుర్తింపు లభించింది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) రూ.1 కోటి వరకు రుణాల్ని కేవలం 59 నిముషాలు, అంత కంటే తక్కువ సమయంలో మంజూరు చేసేలా ఈ వెబ్‌ పోర్టల్‌ను గత ఏడాది నవంబర్ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

బ్యాంకింగ్‌ వ్యవస్థను పారదర్శకంగా మార్చడంతో పాటు సమస్యలు లేకుండా తీర్చిదిద్దడం కోసం చేసిన ప్రయత్నమని ప్రభుత్వం అభివర్ణించింది. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో దీన్ని రూపొందించారు. ఈ పోర్టల్‌ సాయంతో రుణాలు మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని 20-25 రోజుల నుంచి 59 నిముషాల్లోపునకు తగ్గించారు. 

దీనివల్ల బ్యాంకు అధికారుల విచక్షణాధికారంతో నిమిత్తం ఉండదు. సంబంధిత అధికారుల నుంచి సూత్రప్రాయ అంగీకారం అవసరం లేదు. రుణానికి ఆమోదం లభించగానే 7-8 పని దినాల్లో పంపిణీ కూడా జరుగుతోంది.

‘ఆటోమేటెడ్‌ లోన్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థ వల్ల లావాదేవీలు సులభతరం కావడమే కాక పారదర్శకతను ప్రోత్సహించే విధంగా ఉంది. రుణ మంజూరు కోసం వ్యక్తుల జోక్యం అవసరం లేకుండా పోయింది’అని రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఈ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి ఫిబ్రవరి 27 వరకు 1.62 లక్షల ఎంఎస్‌ఎంఈలకు రుణ మంజూరు కోసం సూత్రప్రాయ ఆమోదం లభించింది.  1.12 లక్షల సంస్థలకు రూ.35,065.46 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు  సమాచారం. 35,517 సంస్థలు కొత్తగా రూ.10,047 కోట్లు రుణంగా అందుకున్నాయి

రుణ పునరుద్ధరణ కింద 77,369 సంస్థలు రూ.25,609 కోట్ల రుణాలను పొందాయి. కొత్తగా సంస్థలు సగటున రూ.27 లక్షల రుణం పొందాయి. గతంలో రుణం పొంది, మళ్లీ తీసుకున్న సంస్థలు తీసుకున్న రుణం సగటున రూ.34 లక్షలుగా నమోదైంది.

రుణాలు పొందాలని భావించే సంస్థలు, వ్యక్తులు,  ఆదాయం పన్ను రిటర్న్స్, జీఎస్టీ వివరాలు, బ్యాంక్‌ లావాదేవీల పత్రాలు అందిస్తే సరి. మిగతా ప్రాసెస్ అంతా వెబ్‌సైట్ నిర్వాహకులే చూసుకుంటారు. 

ఇప్పటికీ ఆఫ్ లైన్ లెండర్స్ ఆధిపత్యం వహిస్తున్నారు. వారిలో 80 శాతం బ్యాంకర్లదే వాటా. బ్యాంక్ బజార్, పైసా బజార్, డీల్ 4 లోన్స్, కేపిటల్ ఫ్లోట్, లెండింగ్ కార్ట్ తదితర సంస్థల ఆధ్వర్యంలో పలు ఆన్ లైన్ మోడల్ లోన్స్ మోడళ్లు అభివ్రుద్ధి చెందాయి. 2014లో ఏర్పాటైన లెండింగ్ కార్ట్ ఇప్పటి వరకు రూ.1700 కోట్ల రుణాలిస్తే, కేపిటల్ ఫ్లోట్ 2013 నుంచి రూ.4500 రుణాలు ఇచ్చింది. 

click me!