ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు డిలిట్ చేస్తే ఏడాదంతా ఫ్రీ ‘ఫ్లైట్స్’

By Siva KodatiFirst Published Mar 4, 2019, 10:52 AM IST
Highlights

అమెరికా ఎయిర్‌లైన్స్ ‘జెట్ బ్లూ’ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలన్నీ డిలిట్ చేసిన వారికి ఏడాదంతా ఉచితంగా విమాన సర్వీసులు అందిస్తామని పేర్కొంది. అయితే అదీ కూడా ముగ్గురు అమెరికన్లకేనట. 

పండుగల వేళ పలు విమాన సంస్థలు టికెట్ల ధరలపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. కానీ అమెరికా సివిల్ ఏవియేషన్ సంస్థ ‘జెట్‌ బ్లూ ఎయిర్‌వేస్‌’ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్‌ చేసిన ఫొటోలన్నీ డిలీట్‌ చేసిన వారికి ఏడాది పాటు ఉచిత టికెట్లు ఇస్తామని ప్రకటించింది. 

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన జెట్ బ్లూ సంస్థ ఈ మేరకు ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం అమెరికన్లకు మాత్రమే వర్తిస్తుంది. అదీ కూడా కేవలం ముగ్గురు లక్కీ విన్నర్లకే ఈ అవకాశం కల్పిస్తోంది.

కాంటెస్ట్‌లో గెలిచేవారు ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. అయితే సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించేవారికి జెట్‌ బ్లూ సంస్థ పెట్టిన షరతును పాటించడం కాస్త కష్టమే. 

అలా అన్ని ఫొటోలు తొలగించలేని వారికి మరో ఆప్షన్‌ను కూడా ఇచ్చింది. తమ ఫొటోలు ఎవ్వరికీ కనిపించకుండా ఆర్కైవ్స్‌లో దాచుకోవచ్చు. ఏడాది పాటు వారు ఇచ్చిన ట్రావెల్‌ ఆఫర్‌ పూర్తయ్యాక తిరిగి ఆ ఫొటోలను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకునేవారు సంస్థ కోసం మరో పనిచేయాల్సి ఉంటుంది.

తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో వ్యక్తిగత ఫొటోలు తీసేయడంతో పాటు జెట్‌ బ్లూ లోగోతో ‘ఆల్‌ యు కెన్‌..’ అని క్యాప్షన్‌ ఇవ్వాలి. ప్రచారంలో భాగంగా జెట్ ‌బ్లూ సంస్థ ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాదు సంస్థలో పని చేస్తున్న సిబ్బంది కూడా ప్రచారం కోసం తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లోని ఫొటోలు తొలగించేశారట. 

ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని అనుకునేవారు ఈ నెల ఎనిమిదో తేదీన ఉదయం 9 గంటలకు దరఖాస్తు చేసుకోవాలి. వారిలో ముగ్గురు లక్కీ విజేతలను ఎంపికచేసి ఏడాది పాటు ఉచిత టికెట్లను జెట్ బ్లూ సంస్థ నేరుగా విజేతల ఇంటికి కొరియర్‌ చేస్తుంది.

click me!