సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని మూడీస్ సంస్థ తన నివేదికలో బయటపెట్టింది. ముడి చమురు ధరలు ఎంత పెరిగినప్పటికీ, ప్రస్తుతం చమురు ధరలు పెంచే ఉద్దేశ్యం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లేదని మూడీస్ తెలిపింది.
Petrol-Diesel Price: ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మూడు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వరుసగా 18 నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. ఈ కంపెనీలు దాదాపు 90 శాతం మార్కెట్‌ను నియంత్రిస్తాయి.
గత సంవత్సరం ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. దీని కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఈ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఆగస్టు నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు బలపడటంతో, మొత్తం మూడు రిటైలర్ల లాభాలు (మార్జిన్లు) మళ్లీ ప్రతికూల కేటగిరీలోకి వెళ్లిపోయాయి.
మూడీస్ నివేదిక ప్రకారం, "అధిక ముడి చమురు ధరలు భారతదేశం మూడు ప్రభుత్వ-యాజమాన్య చమురు మార్కెటింగ్ కంపెనీలైన IOC, BPCL, HPCL ల లాభదాయకతను బలహీనపరుస్తాయి." అని పేర్కొంది.
మే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయ ధరలను పెంచేందుకు ఈ మూడు కంపెనీలకు పరిమిత అవకాశాలు ఉంటాయని నివేదిక పేర్కొంది.అయితే అంతర్జాతీయ వృద్ధి బలహీనత కారణంగా చమురు ధరలు ఎక్కువగానే ఉంటాయని నివేదిక పేర్కొంది. ధరలు ఎక్కువ కాలం నిలకడగా ఉంటాయని అంచనా వేసింది.