4,61,976 మంది భారతీయుల చెల్లింపుల వివరాలు డార్క్ నెట్‌లో విక్రయానికి పెట్టినట్లు సింగపూర్‌కు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీ తెలిపింది.
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు అమ్మకానికి వచ్చాయి. గోప్యంగా ఉండాల్సిన సమాచారం అంగడి సరుకైంది. సైబర్ దాడులను నివారించేందుకే ప్రత్యేకంగా పని చేస్తున్న గ్రూపు-ఐబీ ఈ సంగతి గుర్తించింది. 4,61,976 మంది భారతీయుల చెల్లింపుల వివరాలు డార్క్ నెట్‌లో విక్రయానికి పెట్టినట్లు సింగపూర్‌కు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీ తెలిపింది.
డార్క్ నెట్‌లో ఈ తరహా సమాచారాన్ని అమ్మకానికి పెట్టే చాలా రహస్య పోర్టల్స్‌లో ఒకటైన జోకర్స్ స్టాష్.. బుధవారం పెద్ద ఎత్తున క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను అమ్మకానికి తెచ్చిందని గ్రూప్-ఐబీ వెల్లడించింది. ఇందులో 98 శాతం కార్డులు భారతీయులవే. దీంతో ఈ విషయాన్ని భారత అధికార వర్గాలకూ గ్రూప్-ఐబీ తెలిపింది.
ఫిషింగ్ రాకెట్ల నుంచి ఈ డాటాను సేకరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తు తెలియని అమ్మకందారు వెబ్‌సైట్‌లో భారతీయులకు చెందిన క్రెడిట్ కార్డ్ నంబర్లు, వాటి గరిష్ట కాలపరిమితి, సీవీవీ లేదా సీవీసీ సంఖ్యతో పాటుగా కార్డుదారు పేరు, ఈ-మెయిల్, ఫోన్ నెంబర్, చిరునామాలను కూడా విక్రయానికి ఉంచినట్టుగా గ్రూపు-ఐబీ తెలిపింది.
ఈ సమాచారాన్ని అమ్మకందారులు ఈ నెల 5న వెబ్‌సైట్‌లో సేల్‌కు ఉంచినట్టుగా వెల్లడించింది. అమ్మకానికి ఉంచిన కార్డుల మొత్తం విలువ దాదాపు 42 లక్షల డాలర్లు ఉంటుందని గ్రూపు-ఐబీ అంచనా కట్టింది. ఒక్కో కార్డు సమాచారానికి విక్రేతలు రూ.630లకు అమ్మకానికి పెట్టినట్టు సంస్థ తెలిపింది.
ఈ నెల ఆరో తేదీ వరకు దాదాపు 16 కార్డుల సమాచారం అమ్ముడైనట్టుగా కూడా సంస్థ విశ్లేషించింది. కార్డు చెల్లింపు మోసాలకు పాల్పడేందుకు ఇష్టపడే వారు ఈ సమాచారం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. భారత బ్యాంకుల జారీ చేసిన దాదాపు ఐదు లక్షల కార్డుల రహస్య సమాచారాన్ని కొందరు దొంగలించి డార్క్‌వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టిన సంగతిని తాము భారత్‌కు చెందిన ''కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్''కు (సీఈఆర్‌టీ-ఇన్) అందించినట్టుగా సింగపూర్ సంస్థ తెలిపింది.
దీనికి సంబంధించి సీఈఆర్‌టీ-ఇన్ సంస్థ ఎలాంటి చర్యలను తీసుకోనుందన్న విషయమై త్వరలో తెలుస్తుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వాడకాన్ని ప్రభుత్వాలు వివిధ రూపాల్లో తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో వాడకందారులు వివిధ డిజిటల్ మార్గాలవైపు తమ దృష్టి సారిస్తున్నారని సింగపూర్ కంపెనీ తెలిపింది.
వీటిని సురక్షితంగా ఎలా వాడాలి, భద్రత ప్రమాణాల విషయమై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే బ్యాంకు కార్డుల విలువైన సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి చేరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంక్ కార్డులను ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లో వినియోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై అవగాహన లేకే అమాయకులైన ప్రజల బ్యాంక్ కార్డులతో మోసపోతున్నారని సింగపూర్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
అందువల్లే సమాచార తస్కరులకు భారత్ హాట్‌స్పాట్‌గా మారిందని కూడా తెలిపింది. గత ఏడాది ఆక్టోబర్ నెలలో కూడా గ్రూపు-ఐబీ భారతీయులకు చెందిన దాదాపు 13 లక్షల బ్యాంక్ కార్డుల సమాచారం వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచిన విషయాన్ని గుర్తించి భారత్‌ను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో దేశంలో వ్యక్తిగత ఆర్థిక సమాచార పరిరక్షణపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.
ఆ తరువాత ఇలాంటి వాటిని నియంత్రించేందుకు గాను తాము అనేక చర్యలు చేపడుతున్నాట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తాజా ఉదంతం రుజువు చేసింది. సమాచార తస్కరులు ఫిష్షింగ్, మాల్‌వేర్, జెఎస్-స్నిఫ్పర్స్ ద్వారా సమాచార దొంగలిస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. దీనికి తోడు ఆఫ్‌లైన్‌లో పీవోఎస్ టెర్మినల్స్ ద్వారా కూడా సమాచార తస్కరణ జరిగి ఉంటుందని గ్రూపు-ఐబీ అభిప్రాయపడింది.