జెట్ ఎయిర్వేస్ ముంగిట మరో సంక్షోభం: పైలట్ల ‘సమ్మె’ట

By rajesh yFirst Published Mar 30, 2019, 2:45 PM IST
Highlights

ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునే దిశగా ఒక అడుగు ముందుకేసిన జెట్ ఎయిర్వేస్ సంస్థకు మరో సమస్య వచ్చి పడింది. దాదాపు నాలుగు నెలలుగా వేతనాలివ్వకపోవడంతో సిబ్బంది ప్రత్యేకించి పైలట్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి సంస్థ మారిన తర్వాత కూడా స్పష్టత లేకపోవడంతో సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు.

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుని బ్యాంకర్ల చేతుల్లోకి వెళ్లిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను సంక్షోభాలు ఇప్పట్లో వీడే సంకేతాలు కనిపించడం లేదు. వేతన బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ పైలట్లు సమ్మె బాట పట్టారు.

సోమవారం నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) వెల్లడించింది.

‘మార్చి 29 కల్లా ఎస్బీఐ నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం. కానీ దురదృష్టవశాత్తు నిధుల బదిలీ జరగలేదు. అంతేగాక.. పైలట్ల జీతాల చెల్లింపులపై మేనేజ్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి విమానాలు నడపరాదని మేం నిర్ణయించాం’ అని ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్‌ చోప్రా తెలిపారు.

రుణ సంక్షోభంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ గత నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందించలేదు. జీతాలు లేక జెట్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు యాజమాన్యం మారినా వేతనాలపై స్పష్టత లేకపోవడంతో జెట్‌ పైలట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 31లోగా వేతనాలు చెల్లించపోతే ఏప్రిల్‌ 1 నుంచి విధులకు హాజరవబోమని పైలట్లు ఇదివరకే హెచ్చరించారు. తాజాగా జెట్‌కు బ్యాంక్‌ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో సోమవారం నుంచి విమానాలు నడపబోమని స్పష్టం చేశారు. 

జెట్‌ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌.. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లింది. 
 

click me!