అసలే వేల కోట్ల ఫ్రాడ్.. ఆపై పరారీ.. లంచం ఇచ్చి బెయిల్ యత్నాలు.. నీరవ్ మోదీ తీరిది

By rajesh yFirst Published Mar 30, 2019, 10:34 AM IST
Highlights

వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన న్యూయార్క్.. తర్వాత తాజాగా లండన్ నగరంలో తేలి జైలుపాలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీ అక్కడా తన లీలలు మరిచిపోవడం లేదు. బెయిల్ పొందేందుకు లంచం ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యాడు. కానీ భారత్ వాదన.. కేసులో తీవ్రత వల్ల బెయిల్ మంజూరు చేయలేమని లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తేల్చేసింది. 

లండన్‌: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో నిందితుడు, ప్రస్తుతం లండన్ పోలీసుల అదుపులో ఉన్న నీరవ్‌ మోదీ బెయిల్‌ కోసం శుక్రవారం రెండవ సారి వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటషన్‌ దాఖలు చేశాడు. బెయిల్‌ కోసం అతను చేస్తున్న ప్రయత్నాలు పక్కదారి పడుతున్నాయి.

ఎలాగైనా బెయిల్‌ పొందాలని అక్కడి ప్రత్యక్ష సాక్షిని బెదిరింపులకు గురిచేసి, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని భారత్‌ తరఫు న్యాయవాది నేరుగా కోర్టు ద్రుష్టికి తెచ్చారు. ఆశీష్ లాడ్ అనే ప్రత్యక్ష సాక్షిని పిలిచి, చంపేస్తానని బెదిరింపులకు దిగాడని పేర్కొన్నారు. 

తప్పుడు సాక్ష్యం చెబితే రూ.20 లక్షల ముడుపులు ఇచ్చేందుకు కూడా సిద్ద పడ్డారన్నారు. నీరవ్‌ మోదీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్‌ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం. అతనికి బెయిల్‌ మంజూరైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీంతో నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. నీరవ్ మోదీ జీవితం రిస్కుల్లో పడిందని, ఆయన తన వద్ద సొమ్ముతో దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నదని చీఫ్ మేజిస్ట్రేట్ చెప్పారు. 

నీరవ్ మోదీ కేసు తదుపరి విచారణ వచ్చేనెల 26వ తేదీన జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్నది. నీరవ్ మోదీ బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో 10 లక్షల యూరోలు వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి సిద్దమని పేర్కొన్నారు. 

కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సదరు సొమ్ము సరిపోదన్నారు. బిలియన్ డాలర్ల పూచీకత్తు పెట్టినా సరిపోకపోవచ్చుననన్నారు. నీరవ్ మోదీ కేసు ప్రాథమిక దశలో ఉన్నదని, పూర్తిగా పరిశీలించాల్సి ఉన్నదన్నారు. 

ఒకవేళ లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోదీకి బెయిల్ మంజూరైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు వెళ్లేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తగిన ఆధారాలను ఈడీ అక్కడి న్యాయస్థానం ముందు ఉంచింది.

పాస్‌పోర్టు రద్దు చేసిన తర్వాత కూడా నీరవ్ మోదీ మూడు దేశాలకు వెళ్లాడని, దానికి సంబంధించిన ఆధారాలను అందజేసింది. నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు తగిన ఆధారాలను చూపించడానికి ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది.

click me!