కీలక సంస్థలు, బ్యాంకులకు ‘మూడీస్’ నెగెటివ్ రేటింగ్‌..ఎందుకంటే..?

By Sandra Ashok KumarFirst Published Jun 3, 2020, 4:19 PM IST
Highlights

ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ గత రెండు దశాబ్దాల్లో తొలిసారి భారత ప్రభుత్వ సార్వభౌమ రేటింగ్‌ తగ్గించింది. మనదేశ ఆర్థిక మూలాలు బలంగా లేవా?.. కరోనా మహమ్మారి వల్ల బలహీనం అయ్యాయా? అదే నిజమైతే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రభుత్వానికి, దేశీయ సంస్థలకు రుణ పరపతి సంక్లిష్టంగా మారుతుందని మూడీస్ హెచ్చరించింది. 
 

న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా మూడు దిగ్గజ రేటింగ్‌ సంస్థల్లో ఒకటైన మూడీస్‌, భారత సార్వభౌమ రుణ రేటింగ్‌ను బీఏఏ2 నుంచి బీఏఏ3కి తగ్గించి వేసింది. భవిష్యత్‌ అంచనాలు ప్రతికూలంగానే ఉంటాయని మూడీస్ నొక్కి చెప్పింది. బీఏఏ3 అనేది అత్యంత తక్కువ రేటింగ్‌. దీని తర్వాత మిగిలింది జంక్ (చెత్త) రేటింగ్‌.

2017 నుంచీ ఆర్థిక సంస్కరణల అమలు తీరు బలహీనంగా ఉండడం; కొంత కాలంగా ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉండటంతోపాటు కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య పరిస్థితి బాగా క్షీణించడం, భారత ఆర్థిక రంగంలో ఒత్తిడి పెరగడం.. ఇవీ.. రేటింగ్‌ తగ్గించడానికి కారణాలని మూడీస్‌ చెప్పింది. అందులోనూ రేటింగ్‌తో పాటు 'ప్రతికూల ధోరణి'ని ప్రదర్శించింది. 

అంటే భారత్‌ రేటింగ్‌ మరింత తగ్గవచ్చన్న సంకేతాలన్నమాట. కరోనా సమయంలో ఈ రేటింగ్‌ తగ్గింపు వచ్చింది మినహా, కరోనా ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల కాదని కూడా మూడీస్ సంస్థ తేల్చింది.

2017 నవంబర్ నెలలో ఇదే మూడీస్‌ భారత రేటింగ్‌ను 'స్థిర' భవిష్యత్‌ అంచనాతో 'బీఏఏ2'కు మెరుగుపరచింది. ఆ సమయంలో.. కీలక సంస్కరణలను సమర్థంగా అమలు చేస్తే సార్వభౌమ రుణ రేటింగ్‌ బలోపేతమవుతుందని పేర్కొన్నా అలా జరగలేదు. అప్పటి నుంచీ సంస్కరణల్లో అమలు బలహీనంగానే కనిపించిదని మూడీస్‌ చెబుతోంది. 

విధానాల అమలు సామర్థ్యం తగ్గడం వల్ల వృద్ధి కూడా డీలా పడింది. 2019-20లో 4.2 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది 11 ఏళ్ల కనిష్ఠ స్థాయి.

also read హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు కట్టక్కర్లేదు!

ఏటా భారత్‌ ద్రవ్యలోటు లక్ష్యం చేరడంలో విఫలమవుతూ వచ్చింది. దీనితో అప్పులు కూడా స్థిరంగా పెరుగుతూనే వచ్చాయి. 2018-19 జీడీపీలో భారత రుణ భారం 72 శాతంగా ఉంది. 2020లో ఇది 84 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. రేటింగ్‌ అనేది భారత ఆర్థిక తీరుపై ఆధారపడి ఉంటుంది. 

అది తగ్గిందంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు అంతక్రితంతో పోలిస్తే 'మరింత నష్టభయం' ఉన్నట్లు లెక్క. ఆర్థిక వృద్ధి బలహీనపడడానికి తోడు ద్రవ్య పరంగా అధ్వాన పరిస్థితికి వెళుతున్నపుడు, ప్రభుత్వానికి తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గుతుంది. 

ఈ నేపథ్యంలో భారత్‌ కానీ.. భారత్‌లోని కంపెనీలు కానీ విదేశాల్లో జారీ చేసే బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. అంటే ప్రభుత్వం కానీ.. కంపెనీలు కానీ బయటి నిధులను సమీకరించడం సంక్లిష్టమవుతుంది.

భారత్‌పై రేటింగ్‌ ప్రభావం ఇప్పుడే ఏమీ ఉండదని ఎస్‌బీఐ నివేదిక అంటోంది. మన విదేశీ రుణాలపై ప్రభావం పడినా, తట్టుకునేందుకు సరిపడా మారక నిల్వలు ఉన్నాయని చెబుతోంది. 

'మొత్తం మన సార్వభౌమ రుణాల్లో విదేశీ రుణాలు 20 శాతమే. ప్రస్తుతం మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు ఆ రుణ అవసరాలకు సరిపోతాయి' అని ఎస్‌బీఐ తన పరిశోధన నివేదిక 'ఈకోరాప్'లో మంగళవారం పేర్కొంది. ఎక్స్ఛేంజీ రేట్లలో కానీ, బాండ్లపై కానీ తక్షణం ఈ రేటింగ్‌ ప్రభావం ఉండదనీ స్పష్టం చేసింది.

click me!