జియోకు తప్పని కష్టాల్: తేల్చేసిన ‘మూడీ’స్

By Arun Kumar PFirst Published Oct 25, 2018, 12:04 PM IST
Highlights

టెల్కోలకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉండొచ్చు గానీ.. తక్షణం గానీ సమీప భవిష్యత్ లో గానీ కష్టాలు తప్పవని ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్థ ‘మూడీస్’ హెచ్చరించింది. సంచలనాల రిలయన్స్ ‘జియో’ పైనా ప్రభావం పడుతోందని పేర్కొంది.

ముంబై: దేశీయ టెలికం రంగంలో పోటీ.. ఎదుర్కొంటున్న సమస్యలకు సమీప కాలంలోనూ ఉపశమనం ఉండబోదని అంతర్జాతీయ ఇన్వెస్టర్ సర్వీసెస్ ‘మూడీస్’ అంచనా వేసింది. రెండేళ్ల క్రితం రంగ ప్రవేశం చేసి ఇతర టెలికం సంస్థలను చావుదెబ్బ తీసిన రిలయన్స్ జియోకు కష్టాలు తప్పలేదని పేర్కొంది. టెలికం కంపెనీల లాభాల మెరుగుదలకు ఏఆర్‌పీయూ వృద్ధి చాలా కీలకం. జియో సైతం సెప్టెంబర్‌ క్వార్టర్లో ఏఆర్‌పీయూ క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం.


టెల్కో రంగంలో స్థిరీకరణ వల్ల ప్రయోజనాలు దీర్ఘకాలంలోనే ఉంటాయని పేర్కొంది. టెలికం రంగంలో స్థిరీకరణతో ధరల పరంగా మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఇది దీర్ఘకాలానికి సానుకూలమని పేర్కొంది. 2016 సెప్టెంబర్ నెలలో దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్‌ జియో ప్రవేశించడంతో అప్పటికే ఈ రంగంలోనిఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్‌కామ్‌ తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. 


దీంతో టెలికం ప్రొవైడర్ సర్వీసుల సంస్థలు తమ ఆదాయం స్థిరీకరణ, ఆస్తుల విక్రయాలకు దిగాయి. ఉద్యోగులను కోల్పోవడంతోపాటు కొన్ని సంస్థలు దివాళా స్థాయికి చేరుకున్నాయని ‘మూడీస్‌’ తన నివేదికలో గుర్తు చేసింది. ఆదాయం, లాభాలు క్షీణించి, రుణాలు పెరిగిపోవడంతో వొడాఫోన్- ఐడియా విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలిచింది. తర్వాత ఎయిర్ టెల్‌లో టెలినార్, టాటా డొకోమో మధ్య విలీనమైన సంగతి తెలిసిందే. 

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్‌ సేవలు నిలిపివేశాయి. ఇప్పటికీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ.. ఎరిక్సన్ సంస్థకు బకాయిలు చెల్లించాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఇటీవలే ఆయనకు న్యాయస్థానం తుది అవకాశం కల్పించింది కూడా. వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.45 వేల కోట్ల రుణాలు చెల్లించలేక అనిల్ అంబానీ బ్యాంక్ట్రప్టీ (దివాళా) ప్రకటించే స్థాయికి చేరారు. 

ఇదిలా ఉంటే గత జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ తన చరిత్రలో దశాబ్దం తర్వాత తొలిసారి దేశీయ కార్యకలాపాలపై నష్టాలను ప్రకటించింది. సమీప కాలంలో టెలికంలో 60,000 ఉద్యోగాలు తగ్గుతాయని మూడీస్‌ అంచనా వేసింది. ‘మూడు నుంచి నాలుగు సంస్థలతోపాటు ధరల పరంగా మరింత సహేతుక పరిస్థితులు దీర్ఘకాలంలో సాధ్యమవుతాయి. 

కానీ, సమీప కాలంలో సగటు కస్టమర్‌పై  వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరిగేందుకు అవకాశాల్లేవు’ అని మూడీస్‌ స్పష్టం చేసింది. టెలికం కంపెనీల లాభాల మెరుగుదలకు ఏఆర్‌పీయూ వృద్ధి చాలా కీలకం. జియో సైతం సెప్టెంబర్‌ క్వార్టర్లో ఏఆర్‌పీయూ క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం. జియో హ్యాండ్ సెట్ల విక్రయంపై ప్రభావం పడిందని పేర్కొంది.

ఎయిర్‌టెల్‌కు దేశీయంగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా కార్యకలాపాలు చేదోడుగా నిలుస్తాయని మూడీస్‌ పేర్కొంది. టెలికం సంస్థలు తమ ఆదాయం పెంచుకునే వ్యూహాలను పున:లిఖించుకుంటే మంచిదని మూడీస్ హితవు చెప్పింది. భారతీ ఎయిర్ టెల్ తోపాటు టెలికం సంస్థలన్నీ వచ్చే ఆదాయం కంటే 30 శాతానికి పైగా పెట్టుబడి ఖర్చు చేయాల్సిందేనని తేల్చేసింది. 
 

click me!