ఇది ఇండియా బ్రదర్.. నాలుగు రోజులకే మూతబడిన బిట్‌కాయిన్ ఏటీఎం

By sivanagaprasad kodatiFirst Published Oct 25, 2018, 10:15 AM IST
Highlights

బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో అభివ్రుద్ధి చేసిన బిట్ కాయిన్ ఏటీఎం ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే మూత పడింది. దానికి ఎటువంటి అనుమతులు లేవని పేర్కొంటూ బెంగళూరు పోలీసులు దాన్ని మూసేశారు. దాని నిర్వాహకుడు హరీశ్ బీవీని అరెస్ట్ చేశారు.

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన బిట్‌కాయిన్ ఏటీఎం మూతబడింది. ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ యూనోకాయిన్ టెక్నాలజీస్ ఈ ఏటీఎంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏటీఎం నిర్వహణకు  ఎలాంటి అనుమతులు లేవని, ఇది అక్రమమని పోలీసులు చెప్పారు.

అంతటితో ఆగకుండా క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ యూనోకాయిన్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు హరీశ్ బీవీని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. బెంగళూరులోని పాత ఎయిర్‌పోర్టు రోడ్డు వద్దనున్న కెంప్ ఫోర్ట్ మాల్‌లో ఈ కియోస్క్ (ఏటీఎం)ను నడిపిస్తున్నారు. అక్కడికి చేరుకున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు ఏటీఎంను సీజ్ చేశారు. 

రెండు ల్యాప్‌టాప్‌లను, ఓ మొబైల్, మూడు క్రెడిట్ కార్డులు, ఐదు డెబిట్ కార్డులు, ఓ పాస్‌పోర్టు, యూనోకాయిన్ కంపెనీకి చెందిన ఐదు ముద్రికలు, ఓ క్రిప్టోకరెన్సీ డివైజ్, రూ.1.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

హరీశ్‌ను ఏసీఎంఎం కోర్టు ఎదుట హాజరుపరుచడంతో వారం రోజుల పోలీస్ కస్టడీని విధించారు. ఈ కేసులో మరికొందరినీ అరెస్టు చేసే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఈ ఏటీఎంను గత ఆరు నెలల నుంచే నిర్వహిస్తున్నామని నిందితుడు చెబుతున్నట్లు చెప్పిన పోలీసులు.. అతను తమను తప్పుదోవ పట్టిస్తున్నాడని అంటున్నారు.

కియోస్క్ సంస్థ బిట్ కాయిన్ క్రయ విక్రేతలు వేదికగా మారిందని పోలీసులు తెలిపారు. కానీ బిట్ కాయిన్ వ్యవస్థ లాభాలు గడించేందుకు పనికి రాదని, దాని ఆకర్షణకు గురి కావద్దని ప్రజలను పోలీసులు కోరారు. అయితే యూనోకాయిన్ సహ వ్యవస్థాపకుడు సాథ్విక్ విశ్వనాథ్ తమ సంస్థ బిజినెస్ మోడల్‌ను సమర్థించుకున్నారు.

భారతీయులకు చట్టబద్ధంగా ఉపయోగకరమని తెలిపారు. 2018 ఫిబ్రవరిలో బిట్ కాయిన్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత మీడియాలో చాలా ప్రచారం జరిగిందని యూనోకాయిన్ సహ వ్యవస్థాపకుడు సాథ్విక్ విశ్వనాథ్ చెప్పారు.

క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో చట్టబద్ధం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారే గానీ అక్రమం అని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీని నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు కూడా లేవని పేర్కొన్నారు. 

click me!