వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊతమిచ్చింది. రూపే, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ల (ఎండీఆర్) ఫీజులను వచ్చే నెల నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులు, సారథులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు.
భేటీ తర్వాత మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారులు, వినియోగదారులు ఇంకెంతో కాలం ఎండీఆర్ చార్జీలను భరించనవసరం లేదన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూపే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలకు, క్యూఆర్ కోడ్‌తో చేసే లావాదేవీలకు ఎండీఆర్ చార్జీలు వర్తించవన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేస్తుందని వివరించారు.
బ్యాంక్ చెక్ పైన డేట్ రాస్తున్నారా?...అయితే జాగ్రత్త....లేదంటే..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకులు ఈ భారాన్ని భరిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా అన్ని బ్యాంకులు.. రూపే డెబిట్ కార్డులు, యూపీఐకి ప్రాచుర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతాయన్నారు.
కాగా, ఈ నిర్ణయం దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలను భారీగా ప్రోత్సహించనున్నది. రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని సంస్థలు.. రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్‌కోడ్ ద్వారా తమ కస్టమర్లకు చెల్లింపుల వెసులుబాటును కల్పించాలని, దీనివల్ల ఇటు కొనుగోలుదారులు, అటు వ్యాపారులు ఎండీఆర్ చార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు.
‘భాగస్వాములు, బ్యాంకులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాం. ఈ ప్రకటన చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. రూపే, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఎండీఆర్ చార్జీలు లేవు’ అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జూలైలో పార్లమెంట్‌లో ప్రకటించిన బడ్జెట్‌లో ఈ చార్జీల ఎత్తివేతను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. చౌకగా లభించే భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, ఆధార్ పే, డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ విధానాలను తమ కస్టమర్లకు వ్యాపారులు అందుబాటులోకి తేవాలన్నారు.
తమ దుకాణాల్లో కొన్న వస్తువులు, పొందిన సేవల కోసం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్ వద్ద చెల్లింపులకు కస్టమర్లు వినియోగించే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అనుమతించినందుకు బ్యాంకులకు వ్యాపారులు చెల్లించేవే ఎండీఆర్ చార్జీలు. లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలుంటాయి. ఇక క్రెడిట్ కార్డు లావాదేవీలపై రెండు శాతం వరకు ఎండీఆర్ చార్జీలు.. బ్యాంకులు, వ్యాపారులు, కార్డు కంపెనీల మధ్య పంపిణీ అవుతాయి. ఇంతకుముందు 2016లో నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసినప్పుడు కూడా కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఎండీఆర్ చార్జీల భారాన్ని కేంద్రం కొన్నాళ్ల పాటు భరించింది.
డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి....
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కాగ్ దర్యాప్తులకు బ్యాంకర్లు భయపడవద్దని, తప్పు చేయకపోతే అసలు భయం ఎందుకని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు గౌరవం ఇస్తామని, వాటిపై ఎలాంటి వేధింపులూ ఉండవని చెప్పారు.