
అమెజాన్ ఇండియా (Amazon India) హెడ్ అమిత్ అగర్వాల్‌కు (Amit Agarwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీచేసింది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ముందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా, 2019లో అమెజాన్.. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (FCPL)లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు 1,431 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్‌కు 9.82 శాతం వాటా ఉన్నట్లు అయింది. అయితే ఆ సమయంలో అమెజాన్.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA)ని ఉల్లంఘించిందా..? లేదా..? అని ED పరిశీలిస్తోంది. ఇక, ఈ ఏడాది జనవరిలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలపై అమెజాన్ ఇండియాపై కేసు నమోదైంది.
గత ఏడాది ఆగస్టులో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ (Future Group) తన ఆస్తులను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌కు స్లంప్ సేల్ ప్రాతిపదికన రూ. 24,500 కోట్లకు విక్రయించడానికి అంగీకరించింది. అయితే Amazon ఈ డీల్‌ను అడ్డుకునేందకు యత్నిస్తుంది. ఫ్యూచర్ గ్రూప్ తన 2019 పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, అమ్మకాల ప్రణాళికలపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాము 2019లో ఒప్పందం చేసుకునే సమయంలో ఫ్యూచర్ గ్రూప్ వారి ఆస్తులను ఏ ఇండియన్ గ్రూప్‌కు విక్రయించకుండా ఉంటామనే షరతుకు అంగీకరించిందని అమెజాన్ చెబుతోంది.
ఈ క్రమంలోనే అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ న్యాయస్థానాల్లో పోరాడుతున్నాయి. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్యూచర్ కూపన్‌లతో ఫ్యూచర్ రిటైల్ వాటాదారుల ఒప్పందం, అమెజాన్‌తో ఫ్యూచర్ కూపన్‌ల వాటాదారుల ఒప్పందం, అమెజాన్‌తో ఫ్యూచర్ కూపన్‌ల షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం.. ఈ మూడు ఒప్పందాలను కోర్టు పరిశీలించింది. అమోజాన్ ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫ్యూచర్ రిటైల్‌ను నియంత్రణ సాధించినట్టుగా ప్రాథమికంగా అర్థమవుతున్నట్టుగా అభిప్రాయపడింది.
ఇక, ఈడీ జారీ చేసిన సమన్లను పరిశీలిస్తున్నట్టుగా అమెజాన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఫ్యూచర్ గ్రూప్‌కు సంబంధించి ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) జారీ చేసిన సమన్లను మేము స్వీకరించాము. మాకు ఇప్పుడే సమన్లు అందాయి. మేము వాటిని పరిశీలిస్తున్నాము.. ఇచ్చిన గడువులోపు సమన్లపై స్పందిస్తాం’ అని తెలిపారు.