కరంట్ బిల్లు లక్ష దాటితే ఐటీ రిటర్న్స్ తప్పనిసరి...

By Sandra Ashok Kumar  |  First Published Jun 1, 2020, 11:59 AM IST

కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను ముక్కు పిండి వసూలు చేసేందుకు మరింత పక్కాగా ఐటీఆర్‌ ఫారాలు తయారు చేసింది. ఒకవేళ ఒక వినియోగదారుడి కరెంటు బిల్లు రూ.లక్ష దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనని ఆదాయం పన్నుశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.  
 


న్యూఢిల్లీ: వేతన జీవులు, పన్ను చెల్లింపు దారులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ మరింత పట్టు బిగిస్తోంది. ఇక నుంచి బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు, భారీగా కరెంటు బిల్లు కడుతూ ‘మాకేం ఆదాయం లేదు. రిటర్న్‌లు ఫైల్‌ చేయమంటే ఇక కుదరదు’ అని ఐటీ శాఖ తేల్చేసింది. 

 ఇలాంటి పెద్ద మనుషులంతా ఇకపై తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సిందే. 2020 మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2020-21 మదింపు సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందు కోసం  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మొత్తం ఎనిమిది కొత్త ఐటీఆర్‌ ఫారాలు విడుదల చేసింది.

Latest Videos

ఇందులో ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3, ఐటీఆర్‌-4ల్లో రూ.కోటి లేదా అంతకు మించిన కరెంట్‌ ఖాతా డిపాజిట్ల వివరాలు, రూ.లక్ష లేదా అంతకు మించిన కరెంట్‌ బిల్లుల వివరాలు, రూ.2 లక్షలు లేదా అంతకు మించిన విదేశీ ప్రయాణ ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. 

సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు కరెంట్‌ ఖాతాలో డిపాజిట్లు రూ.కోటి దాటితే వార్షిక కరెంటు బిల్లు రూ.లక్ష లేదా అంతకు మించిన వ్యక్తులు, ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు లేదా అంతకు మించి ఖర్చు చేసిన  వ్యక్తులు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే.

also read మాల్స్‌కంటే కిరాణా షాపులే ముద్దు.. సొంత వాహనమే బెస్ట్

కరోనా నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పెట్టుబడుల గడువును ఈ సంవత్సరం జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. పొడిగించిన ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులు, విరాళాల వివరాలనూ ఈ రిటర్న్స్‌లో పొందుపరిచేందుకు వీలుగా అన్ని ఐటీఆర్‌ల్లో డీ1 పేరుతో న్యూ షెడ్యూల్‌ చేర్చారు.

ఐటీ రిటర్న్స్ మినహాయింపులు ఉన్న వారి గురించి తెలుసుకుందాం. ఐటీఆర్‌-1 (సహజ్‌) ప్రకారం వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించని వ్యక్తులు, గృహ ఆస్తుల ఉమ్మడి యజమానులు మినహాయింపు పొందొచ్చు. ఐటీఆర్‌-2 కింద రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ ఆదాయం ఉన్న వ్యక్తులు మినహాయింపులు అడుగవచ్చు. 

ఐటీఆర్‌-3 పరిధిలోకి వచ్చే వ్యాపార ఆదాయం ఉన్న వ్యక్తులతోపాటు వృత్తి లేదా వ్యాపారం ద్వారా రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), సంస్థలు.. ఐటీఆర్‌-4 సుగమ్‌ కింద మినహాయింపులు క్లయిమ్ చేయవచ్చు.

ఐటీఆర్‌-5 ఫామ్ పరిధిలోని పరిమిత భాగస్వామ్య సంస్థలు (ఎల్‌ఎల్‌పీ), అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ (ఏఓపీ)తోపాటు ఐటీఆర్‌-6 పరిధిలో సెక్షన్‌ 11 కింద మినహాయింపు కోరని కంపెనీలు వస్తాయి. ఐటీఆర్‌-7లో ట్రస్టులు, ధార్మిక సంస్థల ఆస్తులపై ఆదాయం పొందే వ్యక్తులకు మినహాయింపు కోసం దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

click me!