తెలివిగా ‘లాక్ డౌన్’ నుంచి బయటపడాలి.. లేదంటే చేటు తథ్యం:ఎస్బీఐ

By narsimha lode  |  First Published May 31, 2020, 12:54 PM IST

భారత ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఎంత త్వరగా అడ్డుకోవాలంటే లాక్‌డౌన్‌ నుంచి దేశం అంత త్వరగా బయటపడాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం ఎంతో తెలివైన వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది.



న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఎంత త్వరగా అడ్డుకోవాలంటే లాక్‌డౌన్‌ నుంచి దేశం అంత త్వరగా బయటపడాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం ఎంతో తెలివైన వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నాలుగో విడుత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

లాక్‌డౌన్‌ను మరింత సాగదీస్తే వృద్ధిరేటు పతనాన్ని అడ్డుకోవడం మరింత ఆలస్యం అవుతుందని శనివారం విడుదల చేసిన అధ్యయన నివేదిక ‘ఎకోవ్రాప్‌'లో ఎస్బీఐ హెచ్చరించింది. మాంద్యం నుంచి త్వరగా కోలుకోవడం తేలికకాదని, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఉన్నత స్థాయికి చేరేందుకు కనీసం ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. 

Latest Videos

లాక్‌డౌన్‌ వల్ల మార్చి నెలాఖరులో జీడీపీ వృద్ధి క్షీణించిందని, అందుకే గత ఆర్థిక సంవత్సర (2019-20) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధిరేటు 3.1 శాతానికి దిగజారి 40 త్రైమాసికాల కనిష్ఠస్థాయికి పతనమైందని ఎస్బీఐ పేర్కొన్నది. దీని ఫలితంగానే గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతానికి దిగజారి 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఎస్బీఐ వెల్లడించింది. 

ఇదిలా ఉంటే సూక్ష్మ, చిన్న పరిశ్రమ (ఎంఎస్‌ఈ)లతోపాటు మైక్రో మార్కెట్‌, వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) మరింత దృష్టిసారించనున్నది.  ఇందుకోసం ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ అండ్‌ మైక్రో మార్కెట్‌ (ఎఫ్‌ఐఎంఎం) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. 

ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుందని ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం ఓపీ మిశ్రా వెల్లడించారు. తెలంగాణలో కూడా ఎస్బీఐ జనరల్‌ మేనేజర్‌ నేతృత్వంలో ఎఫ్‌ఐఎంఎం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా వెల్లడించారు. 

also read:మోదీ ఏడాది పాలన:రూ.27 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల వెల్త్ హాంఫట్

రూరల్‌/సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోని ఎస్బీఐ శాఖల్లో ఖాతాదారులకు వేగవంతంగా సేవలందించేందుకు జిల్లా స్థాయిలో సేల్స్‌ హబ్‌, ప్రాసెసింగ్‌ సెల్స్‌తో ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. 

అంతేకాకుండా ఎస్బీఐ ఖాతాదారులకు త్వరగా రుణాలను పంపిణీ చేసేందుకు ఎస్‌ఎంఈ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించామని ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం ఓపీ మిశ్రా చెప్పారు. టర్న్‌ ఎరౌం డ్‌ టైమ్‌ (టీఏటీ)ను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్లగొండ, వరంగల్‌లో ప్రత్యేకంగా నాలుగు ఎస్‌ఎంఈ సెల్స్‌ను ఏర్పాటు చేశామని మిశ్రా శనివారం ఓ ప్రకటనలో వివరించారు.

click me!